Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

త్వరలో ఉల్లి ఘాటు

గత మూడు నెలలుగా దేశంలో టొమాటో ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్యుల భోజనంలో టొమాటో ఒక అంతర్భాగం అనేది ఎవరూ కాదనలేని సత్యం. అటువంటి టొమాటో ధర కేజీ ఒక్కింటికీ రెండు వందల దాకా పలుకుతోంది.

దానితో ధనవంతుల కిచెన్ల నుండి సైతం టొమాటో మాయమైపోయింది. వచ్చే మూడు నెలలలో టొమాటో ధరలు అదుపులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే తాజాగా టొమాటోతో పాటు ఉల్లి ధరలు ఘాటెక్కనున్నాయని తెలుస్తోంది.

త్వరలో ఉల్లిపాయల ధరలు కూడా అదే దారిలో వెళ్లబోతున్నాయి అన్నది తాజా వార్తల సారాంశం. ప్రస్తుతం కిలో ఉల్లిపాయల ధరలు రీటైల్ మార్కెట్‌లో రూ.30 గా ఉన్నాయి. సెప్టెంబర్ మొదటివారంలో ఉల్లిపాయల ధరలు రూ.60-రూ.70 కి చేరుకుంటాయని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ రిపోర్ట్ తాజాగా వెల్లడించింది.

అతివృష్టి, అనావృష్టి , వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి సరఫరాలో కొరత ఏర్పడటం వల్ల ధరలు పెరుగుతాయని క్రిసిల్ అభిప్రాయపడింది. టమాటా ధరతో పాటు పచ్చిమిర్చి ధర కూడా భారీగా పెరిగింది.

భారీ వర్షాలు, ఉత్తరాదిన కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయల ధరలు పెరిగాయన్నది ప్రభుత్వ వాదన. దీనికి తోడు దిగుబడి కూడా తగ్గిందని వ్యవసాయ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే టమాటాతో పాటు వంటింట్లో అవసరమైన ఉల్లి ధరలు కూడా కొండెక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఉల్లి ధర నెల రోజుల్లో డబుల్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది. ఇక 2020 ఏడాది కంటే దిగువనే ఉల్లి ధరలు కొనసాగుతాయని తెలిపింది. అలాగే ఉల్లి నిల్వ కాలం 2 నెలలు తగ్గాయని క్రిసిల్‌ తెలిపింది..

ఆగస్టు చివరి నాటికి ఇది మరింత తగ్గే అవకాశం ఉందని వివరించారు. సెప్టెంబర్‌ నాటికి సరఫరాలు తగ్గి, ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు క్రిసిల్‌ పేర్కొంది.

అయితే అక్టోబర్‌ నుంచి ఖరీఫ్‌ పంట వస్తుంది కాబట్టి, దిగుబడులు పెరిగితే ఉల్లి ధరలు మళ్లీ తగ్గుతాయని చెప్పుకొచ్చారు.

అయితే క్రిసిల్ సంస్థ ముందుగానే ఉల్లి ధరలు పెరుగుతాయని ఊహించినందున రిటైల్ మార్కెట్ లో వ్యాపారస్థులు ఉల్లిపాయలను ముందే తక్కువ ధరలకు కొని అక్రమంగా దాచి వుంచి తదనంతరం సరఫరా తగ్గినప్పుడు ఎక్కువ ధరలకు అమ్మే అవకాశాలు మెండుగా వున్నందున ప్రభుత్వం ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా ఉల్లి సరఫరాను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

( ప్రత్యేక కధనం: సి.హెచ్.ప్రతాప్)