Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. శవాన్ని కొరికేసిన ఎలుకలు 

(ప్రత్యేక కధనం: సాయిప్రతాప్)

తెలంగాణాలో కారొప్రేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు పని చేస్తున్నాయని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరచుగా ఘనమైన ప్రకటనలు చేస్తూ వుంటుంది. అయితే సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల తీరు నానాటికీ తీసుకట్టుగా మార్తొందని తరచుగా జరిగే ఘటనలు నిరూపిస్తుంటాయి.

తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు సిబ్బంది యత్నించారని, ఇందుకోసం గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నింవ్హారని సమాచారం.

అయితే మృతదేహాన్ని ఎలుకలు కొరకడాన్ని స్థానికులు ఫొటో తీయడంతో పాటు ఆ ఫొటోలు, వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండదంతో ఒక్కసారిగా ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.

ఈ ఘటనకు ఎవరు బాధ్యులనే అంశంపై లోతైన దర్యాప్తు చేపడతామని ప్రభుత్వం మీడియా సాక్షిగా శనివారం నాడు వివరణ ఇచ్చింది. ఉదయం నుండి ఈ వార్త పలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే… ఇటీవల ప్రగతినగర్‌కు చెందిన పెరికల రవి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా వైద్యులు మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు.

ఈ సమయంలో సిబ్బంది పట్టించుకోకపోవడం, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి అని చెబుతున్నారు. . మృతుడి కుటుంబసభ్యులు వచ్చి చూడగా ముఖం, చెంపలు, నుదుటి భాగంలో ఎలుకలు కొరికినట్లు గుర్తించారు.

దేహాన్ని ఎలుకలు కొరకడాన్ని స్థానికులు ఫొటో తీయడంతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో బయటకు వచ్చింది. మృతదేహాన్నీ గంటల కొద్దీ వదిలేసి వెళ్లిపోవడం.. ఆస్పత్రిలో భారీగా ఎలుకల సమస్యలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

వైద్యుల తీరుపై కుటుంబసభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.