Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పత్తి పంట తొలిదశలో తామర పురుగు ఆశించే అవకాశం

పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
వ్యవసాయ అధికారి రాజేష్ కుమార్
మెదక్ అల్లాదుర్గం ఆగస్టు 03 (నిజం చెపుతాం)
అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో వ్యవసాయ అధికారి రాజేష్ కుమార్ పత్తి పంటను పరిశీలించి తీసుకోవాలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు.పత్తి పంట తొలిదశలో వర్షాభావ పరిస్థితుల గురైనట్లయితే తామర పురుగు ఆశించే అవకాశం ఉన్నది.

ఈ తామర పురుగు పిల్లా మరియు తల్లి పురుగులు లేత ఆకు అడుగుభాగం నుండి మరియు రెండు ఆకుల మధ్య ఉన్న పెరిగే మొక్క భాగం నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకుల పైకి ముడుచుకోవడం మరియు మొక్క పెరుగుదల అస్తవ్యస్తంగా అవడం వలన మొక్క పెరుగుదల కుంటుబడిపోవడంతో పాటు ఆలస్యంగా పరిపక్వానికి రావడం జరుగుతుంది.

నివారణకు తొలిదశలోనే వేపను 1500 పిపిఎం 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఉధృతిని బట్టి పిప్రోనిల్ 2 ml లేదా థాయోమిథాక్సోమ్ 0.2 gm లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

తామర పురుగులు భూమిపై పొరల్లోనే కోషస్థ దశలో ఉంటాయి. కావున ఈ రసాయన మందులను పిచికారి చేసినప్పుడు మొక్క చుట్టూ, భూమిమీద మందు ద్రావణాన్ని పిచికారి చేసిన యెడల చాలావరకు పురుగు ఉద్ధృతిని అదుపులో ఉంచుకోవచ్చు.
అదేవిధంగా పేను బంక పత్తి పంట తొలి దశలో బెట్టకు గురైనప్పుడు ఆశించే అవకాశం ఉంది.

పేను బంక తల్లి మరియు పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాల నుండి లేత కొమ్మల వరకు రసాన్ని పిలుస్తాయి. దీని ద్వారా మొక్క పెరుగుదల తొలి దశలోనే కుంటుపడిపోయే అవకాశం ఉన్నది.

అయితే మిత్ర పురుగులు ముఖ్యంగా అక్షింత పురుగులు గమనించినట్లయితే రసాయన మందుల పిచికారి అవసరం లేదు. తొలి దశలో పేను బంకు ఉధృతి బాగా ఉన్నట్లయితే ఒకటి లేదా రెండుసార్లు 5% వేప కషాయం లేదా వేప నూనె 1500 ppm ను 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

పురుగు ఉధృతిని బట్టి పిప్రోనిల్ 2 ml లేదా థాయోమిథాక్సోమ్ 0.2 gm లేదా ఇమిడక్లోరోప్రిడ్ 2 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఏఈఓ అమృత్ రావు మరియు రైతులు పాల్గొన్నారు.