Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చాకిరి బారెడు.. వేతనం మూరెడు

.సమస్యల్లో ఎన్ పి డి సి ఎల్ అన్ మ్యాన్డ్ కార్మికులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆగష్టు 02 (నిజం చెపుతాం) : గ్రామాల్లో విద్యుత్ సమస్యలేవీ తలెత్తినా ఆన్ మ్యాన్డ్ ప్రత్యామ్నాయ కార్మికులే ముందు గుర్తుకొస్తారు. ఏ సమయమైనా వారు రావాల్సిందే ఎన్పీడీసీఎల్ లో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

విద్యుత్ సిబ్బందికి సహాయకారిగా మాత్రమే ఉండాల్సిన వారే అన్ని పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వీరికి పనికి తగిన వేతనం అందడం లేదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబ సభ్యులు దిక్కులేని వారవుతున్నారు.

ఎన్పీడీసీఎల్ సంస్థలో 2013 నుంచి అన్ మ్యాన్డ్ కార్మికులు విధులు నిర్వహిస్తూ. చాలీ చాలని జీతంతో కాలం నే ట్టుకొస్తున్నారు. వీరిలో దాదాపు అందరూ ఐటిఐ, డిప్లొమా పూర్తి చేసినవారే.

విద్యుత్ సిబ్బంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి పనిలో వీరిని భాగస్వాములను చేస్తున్నారు. స్తంభం ఎక్కడం నియంత్రికలను సరిచేయడం చెట్ల కొమ్మలు నరకడం పనులను నిర్వహిస్తున్నారు.

వీటితోపాటు బిల్లుల రీడింగ్ తీయడం, వసూల్ చేయడం, నాన్ స్లాబ్ మీటర్ రీడింగులు తీయడం 11,33 కె.వి లో సమస్యల పరిష్కారం ప్యూజులు వేయటం నియంత్రికలు సరిచేయడం, మరమ్మతులు చేయడం మొండి బకాయిలను వసూలు చేయడం విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, తొలగించడం రాత్రి పగలు అనే తేడా లేకుండా వెట్టి చాకిరి చేస్తున్నారు.

ఉప కేంద్రాలలో సిబ్బంది లేకపోతే వీరే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రమాదకరంగా విధులు..
సంస్థలో పనిచేస్తున్న దాదాపు1378 మంది కార్మికులకు రూ,,8200 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. అయితే వీరు నిబంధనలకు విరుద్ధంగా స్తంభాలను ఎక్కాల్సి వస్తుంది. సమాచార లోపంతో రాంగ్ ఎల్ సి తీసుకోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. కొంతమంది స్తంభాలపై నుంచి పడి వైకల్యానికి గురవుతున్నారు.

గతంలో ఆర్టీజనుగా గుర్తింపు..
ఏళ్లుగా సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్లు, ఉప కేంద్రంలో ఆపరేటర్లు, వాచ్ మెన్లుగా విధులు నిర్వహించిన దాదాపు 23000 మందిని ఆర్టిజన్ గా గుర్తించారు. అన్ మ్యాన్డ్ కార్మికులను సైతం సంస్థ ఆర్టీజన్లు గా గుర్తించి విద్యుత్ సిబ్బందితో సమానంగా పనికి తగ్గ వేతనాన్ని అందించాలని కొన్నేళ్లుగా వారు డిమాండ్ చేస్తున్నారు.

పీ ఏప్ లేదన్న సాకుతో గతంలో వారిని ఆర్టీజన్ గా గుర్తించలేదు. ప్రస్తుతం ప్రతి అన్ మ్యాన్డ్ కార్మికుడికి పిఎఫ్ అమలవుతున్న దృష్ట్యా తమను సైతం అలాగే గుర్తించాలని వేడుకుంటున్నారు.

పలు డిమాండ్లు..
సంస్థ చేపట్టే ఉద్యోగ నియామకల్లో అన్ మ్యాన్డ్ కార్మికులకు సీనియారిటీ ప్రకారం జూనియర్ లైన్ మెన్ నియామకల్లో వెయిటేజీ మార్కులను కేటాయించాలని వారు కోరుతున్నారు. ఖాళీగా ఉన్న ఆపరేటర్ ఉద్యోగాలను తమతో భర్తీ చేయాలనిడిమాండ్ చేస్తున్నారు.ఉద్యోగ భద్రత కల్పించిప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు.

పనికి తగిన వేతన అందించాలి..
వేముల కిరణ్
అన్ మ్యాన్డ్ కార్మికుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్

ఎన్పీడీసీఎల్ లో రాత్రి పగలు అనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నాం. పనికి తగిన వేతనం అందించాలని, ఆర్టీజన్ గా ఉద్యోగులుగా గుర్తించాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.