అధిక వర్షాల వల్ల ప్రత్తిలో వేరు కుళ్ళు తెగులు
– జిల్లా ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన అధికారులు
బోయినిపల్లి, ఆగస్టు 02 నిజం చెపుతాం;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామములో జిల్లా ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం మరియు మండల వ్యవసాయ అధికారితో కలిసి రైతులు సాగు చేస్తున్న ప్రత్తి మరియు వరి పంటలను పరిశీలించడం జరిగింది.
గత కొద్దరోజులుగా కురిసిన అధిక వర్షాల వల్ల ప్రత్తిలో వేరు కుళ్ళు తెగులు గమనించడం జరిగింది.అంతేకాకుండా ప్రత్తిలో ఆకుమచ్చ మరియు రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని గుర్తించడం జరిగింది.
ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు ప్రోఫీకోనజోల్ 200 ఎంఎల్ ఎకరానికి పిచికారి చేయాలి.అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 600 గ్రా/ఎకరానికి మొక్క మొదళ్ళ దగ్గర మందును పోయాలి.
అలాగే నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో మురికి నీరును కాలువల ద్వారా తీసివేయాలి.రసం పీల్చే పురుగుల నివారణకు అసిఫేట్ 1.5 గ్రా/లీటరు లేదా ఇమిడాక్లాప్రెడ్ 0.3 మిలీ/ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
అదే విధంగా వరిలో ప్రధానంగ వచ్చే మొగి పురుగు లక్షణాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు.మొగి పురుగు నివారణకు చేపట్టవలసిన చర్యలను తెలియజేయడం జరిగింది.
నారుమడిలో మరియు పిలక దశలో మొగి పురుగు ఆశిస్తే మొక్కలు ఎండి చనిపోతాయి. మొగి పురుగు లక్షణాలు, ముదురు గోధుమ, ఎoడుగడ్డి, పసుపు రంగులో ఉన్న ఆడ పురుగుల ముందు జత రెక్కలపై నల్లటి మచ్చ కలిగి వుంటాయి.
తెలుపు గోధుమ రంగులో వుండే పిల్ల పురుగులు (లార్వా) ఎదిగిన తరువాత నారింజ పసుపు రంగు తల కలిగి వుంటుంది. నారు పీకే 7 రోజుల ముందు 2 గుంటల నారు మడికి 800 గ్రాముల కార్బోప్యురాన్ 3జి గులికలను చల్లి,నీటిని ఆ మడిలోనే ఇంకెట్లు చేయాలి.
ముదురు నాటు నాటేటప్పుడు నారు కొనలను త్రుంచి వేయాలి.
నాట్లు వేసిన 10 నుండి 15 రోజులలో కార్బోప్యురాన్ 3జి గుళికలను ఏకరానికి 10 కిలోల చొప్పున లేదా కార్టప్ హైడ్రో క్లోరైడ్ 4జి గుళికలు ఎకరానికి 8 కిలోలు లేదా క్లోరాoత్రనిలిప్రోల్ 0.4 జి గుళికలు 4 కిలోల చొప్పున చల్లుకోవాలి.
చిరు పొట్ట దశలో ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కార్టప్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్.పి. 400 గ్రా/ ఎకరాకు లేదా క్లోరంత్రిన్నిలిప్రోల్ 60 మి. లి/ ఎకరాకు పిచికారి చేసుకోవాలి.
క్షేత్ర సందర్శనలో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ శాస్త్రవేత్తలు డా. ఉషా రాణి, డా.పి.మధుకర్ రావు మరియు జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా.కె.మదన్ మోహన్ రెడ్డి, శాస్త్రవేత్త డా.ఏం. రాజేంద్రప్రసాద్ మరియు మండల వ్యవసాయ అధికారిని ప్రణీత మరియు రావెప్ విద్యార్థినులు మరియు రైతులు పాల్గొన్నారు.