కూలర్ షాక్ తో మూడేండ్ల బాలుడు మృతి
తెలంగాణ స్టేట్ బ్యూరో జులై 31 నిజం న్యూస్
మహబూబాబాద్ జిల్లా:
బుడిబుడి అడుగులు, చిట్టిపొట్టి మాటలతో ఆ ఇంట్లో నవ్వులు పూయించిన మూడేండ్ల చిన్నారి పాలిట కూలర్ వైరే యమపాశమైంది.
అప్పటి వరకు తల్లిదండ్రుల కండ్ల ముందే సంతోషంగా గంతలేస్తూ ఆడుకున్న చిన్నారి.. అంతలోనే మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళ్తే..ఆటటాడుకుంటున్న చిన్నారి విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషాదకర సంఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దరావత్ భాస్కర్-కళ్యాణి దంపతులు ఇంటి వద్ద పని చేసుకుంటుండగా వారి కుమారుడు మూడేండ్ల అర్జున్ ఇంటి పక్కనే ఉన్న అమ్మమ్మ కాంతమ్మ ఇంట్లో ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కూలర్ వైర్లు పట్టు కోవడంతో షాక్‌కు గురయ్యాడు. గమనించిన తల్లితుండ్రులు వెంటనే చిన్నారిని మహబుబాబాద్ దవాఖానకు తీసుకవెళ్లగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
అయితే ఇద్దరు ఆడ సంతానం తర్వాత పుట్టిన కుమారుడు కావటంతో అర్జున్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ముడెండ్లకే చిన్నారి మృతి చెందటంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.