Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉద్యమకారులకు గుర్తింపు ఏది..?

● చేవెళ్ల తెలంగాణ ఆత్మ గౌరవ సదస్సులో ఉద్యమకారులు
● త్యాగాలు ఉద్యమకారులు చేస్తే భోగాలు ఉద్యమ ద్రోహులు అనుభవిస్తున్నారు
● ప్రపంచం అబ్బురపోయేలా స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని నడిపినాము
● ప్రొఫెసర్ కోదండరాం
● ఉద్యమ ద్రోహులకు సింహాసనాలు.. ఉద్యమకారులకు అవమానాలు
● దొంగల చేతిలో.. పెట్టుబడిదారుల చేతిలో తెలంగాణ
● ఉద్యమ నేత అద్దంకి దయాకర్
● నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు గుర్తించకపోవడం దౌర్భాగ్యం
● తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు చీమ శ్రీనివాస్
● తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇన్నేళ్లయినా ఉద్యమకారులకు సముచిత స్థానం లేదు
● ఉద్యమకారులకు డబుల్ బెడ్ రూమ్, స్థాయికి తగ్గ ప్రాధాన్యత ఇవ్వాలి
● తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు దేశమల్ల ఆంజనేయులు
*చేవేళ్ల, జూలై 30 (నిజం న్యూస్) :*
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టి స్వరాష్ట్ర ఏర్పాటుకు కారణమైన ఉద్యమకారులకు గుర్తింపు ఏదని ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

చేవెళ్ల మండల కేంద్రంలోని కెజిఆర్ గార్డెన్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు దేశమల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు సభను నిర్వహించారు.

చేవెళ్ల మండల కేంద్రంలో ఉద్యమకారులు ర్యాలీగా బయలుదేరి షాబాద్ చౌరస్తా నుండి బస్టాండ్ కూడలి సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

సభావేదికపైన ఉద్యమకారులు ఇటీవల మృతి చెందిన ఉద్యమకారుడు చలమారెడ్డికి సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు.

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన

ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ..

రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయిందని అన్నారు. ప్రపంచమంతా అబ్బురపోయేలా ఉద్యమాన్ని నడిపినామని గుర్తు చేశారు. త్యాగాలు ఉద్యమకారులు చేస్తే భోగాలు ఉద్యమ ద్రోహులు అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రిని అడుక్కునే దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. మన ఓటు గనుక లేకపోతే ముఖ్యమంత్రి గద్దెనికేవాడు కాదని ఎద్దేవా చేశారు.

స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమాలలో ఉద్యమకారులు రైళ్లకు ఎదురుగా వెళ్లి, పెట్రోల్ పోసుకొని భగభగ మంటల్లో జై తెలంగాణ నినాదంతో నిండు ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉద్యమకారులంతా గురవుతున్నారని తెలిపారు. ఉద్యమం చేసిన ఉద్యమకారులంతా తమ తమ జీవనమనుగడ కోసం పొద్దున లేచి పొట్ట చేతిలో పట్టుకొని హైదరాబాద్ నగరానికి పనులకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గద్దెనెక్కిన వారు వారి భూములను కాపాడుకోవడానికి ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారన్నారు. ప్రజల భూములను కాపాడడానికి కాదని పేర్కొన్నారు.

గద్దెనెక్కిన వారి ఆస్తులు ఆనాడు ఎంత? ఈనాడు ఎంత? అనేది యావత్ తెలంగాణ ప్రజానీకం గ్రహించాలని తెలిపారు. వారి ఆస్తులు పెరిగిపోయాయని అన్నారు. శ్రీకాంతాచారి అమరత్వమే లేకపోతే ఈనాడు ముఖ్యమంత్రి ఎక్కడ? ఉండేవారని అన్నారు.

ఉద్యమకారులు అడుక్కోవడం బంద్ చేసి గుంజుకోవడం నేర్చుకోవాలన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని తెలిపారు.

ఈ సమావేశాలు ఉద్యమకారుల శక్తిని ఐక్యత చేసుకోవడం కోసమని అన్నారు. అమరవీరుల ఆశయాలను బ్రతికించాలని ఆ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఉద్యమ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ..
రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుడు చలమారెడ్డి మరణం సమాజానికి తీరని లోటని అన్నారు. రంగారెడ్డి జిల్లా గొప్ప ఉద్యమకారుడిని కోల్పయిందన్నారు.

ఉద్యమకారుడు యాదిరెడ్డి మరణం ఢిల్లీ స్థాయిలో మారుమోగిందన్నారు. ఉద్యమకారులను గుర్తించండి అని ప్రభుత్వాన్ని బిక్షం ఎత్తుకునే దౌర్భాగ్య దుస్థితి ఏర్పడిందన్నారు. ఉద్యమ ద్రోహులకు సింహాసనాలు ఉద్యమకారులకు అవమానాలని ఎద్దేవా చేశారు.

ఉద్యమకారులు ప్రజాస్వామిక తెలంగాణ కోరుకుంటారు తప్ప ఏవేవో పదవులు కావాలని కోరుకోలేదన్నారు. రాజకీయాలకతీతంగా ఉద్యమకారులు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు.

దొంగల చేతిలో పెట్టుబడిదారుల చేతిలో తెలంగాణ బందీ అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యమకారుని కుటుంబానికి కోటి రూపాయలు ఇంటికొక ఉద్యోగం ఇస్తుందన్నారు.

ఉద్యమకారుల ఆకాంక్షల డిమాండ్లను ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటును కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చుతామన్నారు. తెలంగాణ సంపద దోపిడి అవుతుందని అన్నారు. ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తుంచుకుందమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు గౌరవ వేతనం ఇచ్చేలా కృషి చేస్తామన్నారు.
చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ..

ఉద్యమకారులను గుర్తించని పక్షంలో ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయని పక్షంలో మరో ఉద్యమం చేస్తామన్నారు. జై తెలంగాణ అనే నినాదంతో ఉద్యమకారులు లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లారని గుర్తు చేశారు.

అటు అధికార పార్టీ గానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు గానీ ఉద్యమకారులను గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు.

ఉద్యమకారులంతా పెద్ద ఎత్తున ఐక్యతగా నిలవాలన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులను గుర్తించడం లేదని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమాలు చేసి 1200 మంది బలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు.

ఉద్యమాల్లో ఏ ఒక్కరోజు కూడా పాల్గొనని వారికి మంత్రి పదవులు దక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులను గుర్తించాలన్నారు.

*దేశమల్ల ఆంజనేయులు మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇన్నేళ్లయినా ఉద్యమకారులకు సముచిత స్థానం లేదన్నారు. ఉద్యమకారులకు డబుల్ బెడ్ రూమ్, స్థాయికి తగ్గ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు పెట్టేలా కృషి చేస్తామన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ యాలాల మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు అందరూ ఐక్యతగా ముందుకు సాగుతామని అన్నారు. ఉద్యమకారుడు మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ కొట్లాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని మన హక్కుల కోసం పోరాటాలకు దిగుదామని తెలిపారు. ఉద్యమకారుడు అల్లి శ్రీశైలం మాట్లాడుతూ ఓటే ఆయుధంగా ఉద్యమ ద్రోహులను రాజకీయ సమాధి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జడ్పిటిసి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు కొంతం యాదిరెడ్డి, శేరి పెంటా రెడ్డి, సామ మాణిక్ రెడ్డి పాండు కురుమ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు, కరికే మల్లేష్, డప్పు చందు, శేరి రాజు, మైపాల్, ఉపేందర్ రెడ్డి, అశోక్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.