Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భారీ వర్షాలతో పత్తి పంటకు ఊహించని నష్టం

౼ ఎడతెరిపి లేని వర్షాలతో పత్తి పంటకు నష్టం
౼ విత్తనాలు, మొక్కలు కుళ్లిపోతాయంటూ రైతుల ఆందోళన
౼ పొలాల్లో నిలుస్తున్న నీరు
చేవెళ్ల, జూలై 27 (నిజం న్యూస్) :
ఖరీఫ్ సాగులో సీన్‌ రీవర్స్‌ అయింది. రోహిణి, మృగశిర కార్తెలో విత్తిన పత్తి విత్తనాలకు సరైన వర్షాలు లేక ఒకటికి మూడు సార్లు విత్తుకున్నారు. మొదట్లో మొలకెత్తకపోవడంతో వర్షాలు రాక నష్టం వచ్చింది.

మొలకెత్తిన దశలో ముసురు వర్షాలకు కలుపు గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు కనీసం ఆరుతడి పంటలకు కూడా సరిపోను వర్షాలు కురవక ఇబ్బంది పడిన రైతులు ఇప్పుడు విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గడిచిన పదిరోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి చేలల్లో వరద నీరు నిలిచింది. దీంతో పత్తి మొక్కలు రంగుమారాయి.

నాలుగైదు ఆకులతో ఉన్న మొక్కలు చుట్టూ వర్షం నీరు నిలవడంతో మొక్కలు ఎరుపు రంగులోకి మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో పత్తి పంటకు ఊహించని నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వర్షాలకు పత్తి మొక్కలు కుళ్లిపోతున్నాయని, ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో సాగు చేసిన పత్తికి భారీ వర్షాలతో తీవ్ర నష్టం తప్పని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రోజూ ముసురు, లేదంటే భారీ వర్షాలతో పత్తి చేలల్లో కలుపు తీయాలన్నా, ఎరువులు వేయాలన్న వీలుకావడం లేదని, ఫలితంగా పత్తి మొక్కలు బలహీనమై ఎరుపురంగులోకి మారి ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక పెట్టుబడి పెట్టి దిగుబడి కోసం దిగాలుగా ఉన్న రైతులకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయని వాపోతున్నారు. భూమిలో పెరిగే తేమశాతంతో పాటు తెగుళ్లు దాపురిస్తాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో పత్తి మొక్కలను మించి కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. రైతులు కలుపులు తీయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

ధైర్యం చేసి మందులు కొడితే వానొస్తే ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున నష్టం వచ్చే అవకాశం ఉందని వెనకాడుతున్నారు.

ఎడతెరిపి లేని వర్షాలకు పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని, ఇలాగే మరో వారం రోజులపాటు వర్షాలు కురిస్తే పత్తి పంట దిగుబడి వచ్చేది కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.