Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వర్షాల సమయంలో రైతులు చేయాల్సిన పనులు ఇవే

జమ్మికుంట,జూలై 26 (నిజం చెపుతాం)

ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల గత వారం రోజులుగా రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజులలో జిల్లాలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి…

ఈ సమయంలో వివిధ పంటలలో చేయవలసిన పనులను గమనించినట్లయితే……

వరిలో : ఇది వరకే నార్లు పోసుకున్న రైతులు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ప్రధాన పొలాన్ని సిద్ధం చేసుకొని నాట్లు వేసుకుంటున్నారు.

ప్రస్తుతం వరి సాగు చేసుకోవాలనే రైతులు స్వల్ప కాలిక (JGL- 24423 KNM -118 MTU-1010, KNM-1638) రకాలను (120-125 రోజులు) నారు పోసుకోవచ్చు. వీలు కాని పరిస్థితులలో వర్షాలు తగ్గిన తర్వాత దమ్ము చేసిన పొలాల్లో నేరుగా విత్తే పద్ధతులను. (వెదజల్లడం లేదా డ్రమ్ సీడర్) అవలంబించాలి.

అధిక వర్షాల వల్ల వారు మళ్ళలో నిలిచి ఉన్న నీటిని కాలువల ఏర్పాటు చేసే బయటికి పంపాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో నారు మడి లో అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉంది.

నివారణకు ట్రైసైక్లోజోల్ + మాంకోజెట్ ల మిశ్రమాన్ని 2.5 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.

నారు తీయడానికి 5-7 రోజుల ముందు ఒక ఏకరాకి సరిపడే నారుమడికి 800 గ్రా. కార్బోప్యూరాన్ గుళికలు ఇసుకతో కలిపి చల్లుకోవడం వల్ల ఉల్లికోడు కి మొగి పురుగు తాకిడి ని తగ్గించవచ్చు.

బాగా నారు ముదిరి, ఆలస్యంగా నాటినప్పుడు కుదుళ్ళ సంఖ్యను పెంచి, కుదురుకు 6-8 మొక్కల చొప్పున దగ్గరగా నాటు వేయాలి.

అలా ముదురు నారు నాటినప్పుడు సూచించిన నత్రజని లో 2/3 వ వంతు అనగా ఒకటిన్నర (15) బస్తా యూరియా ఎరువును సూచించిన -భాస్వరం & పొటాష్ ఎరువులతో కలిపి నాటుకు ముందుగా వేసుకోవాలి.

పత్తిలో: ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రత్తి పంట ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులను గమనించినట్లయితే…….

మొదటగా చేను లో నిలిచి ఉన్న మురుగు నీటిని కాలువల ద్వారా బయటికి పంపాలి.

వర్షాలు తగ్గిన తర్వాత వీలైనంత త్వరగా అంతరకృషి చేసి నేలలో తేమ శాతం తగ్గేటట్లు చూడాలి..

అంతరకృషి కుదరని పరిస్థితులలో కలుపు నివారణ కోసం కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నపుడు పైరిథియోబ్యాక్ సోడియం+ క్విజలోపాప్ ఇథైల్ 500 మి.లీ మందును 200 లీటర్ల నీటిలో కలిపి + ఎకరానికి పిచికారి చేయాలి.

వర్షాలు తగ్గిన వెంటనే ఎకరాకు 25 నుండి 30 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను పైపాటుగా వేసుకోవాలి.

ఎండ ఉన్న సమయంలో 20 గ్రాముల పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధి లో రెండు సార్లు మొక్కలపై పడే విధంగా పిచికారి చేయాలి.

. అధిక వర్షాల వల్ల భూమి లో నీరు నిల్వ ఉండటం వల్ల మొక్క వడలిపోయి వేరు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ తెగులు వచ్చినట్లైతే మొక్క లోని అన్ని భాగాలు పై నుండి కిందకి వాడిపోయి మొక్క పూర్తిగా ఎండిపోతుంది.

ఇలా గమనించినట్లైతే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదళ్ళ చుట్టూ నేలపై పోయాలి.

మొక్కజొన్నలో : అధికంగా వర్షాలు కురిసినపుడు లేత పైరు అధిక తేమను తట్టుకోలేదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి పొలం నుండి వర్షపు నీటిని మురుగు కాలువల ద్వారా బయటకు తీయాలి.

ఈ పరిస్థితుల్లో కలుపు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది.

పంట విత్తిన 30 రోజుల లోపల కలుపు అధికంగా ఉన్నట్లయితే పిచికారి చేయవలసిన కలుపు మందులు,
టెంబోట్రయాన్ అనే కలుపు మందును 115 మి.లీ+ అట్రాజిన్ 400 గ్రా. ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పంట విత్తిన 15-18 రోజుల మధ్య పిచికారి చేసినట్లయితే వివిధ రకాల కలుపు మొక్కలను నియంత్రించవచ్చు..
తుంగ నివారణకు సెమ్ ప్రా మందును 36 గ్రా. ఒక ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి తుంగ 4 ఆకుల దశలో ఉన్నపుడు పిచికారి చేయాలి.

నేలలో ఎక్కువగా తేమ ఉన్నందున టర్సికమ్ ఆకు మాడు తెగులు ఆశించే అవకాశం ఉంది. ముందస్తు చర్యగా నివారణకు మాంకొజెట్ 2.5 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఈ పరిస్థితులలో మొక్కజొన్న లో బాస్వరం లోపం ఏర్పడి మొక్కలు ఉదా రంగులోకి మారే అవకాశం ఉంది. నివారణకు వర్షం తగ్గన తర్వాత 20 గ్రాముల డి ఏ సి (నీటిలో కరిగించినది) ని లేదా 19:19:19 పోషకాన్ని 5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.

కందిలో : సాధారణంగా వర్షాలు ఎక్కువగా పడి పంటలలో నీరు నిలిచినప్పుడు ఇనుము దాతులోపం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది.

ఇనుము ధాతు లోపం వచ్చిన మొక్కల ఆకులు లేత పసుపు రంగు నుండి తెలుపు రంగులో ఉంటాయి. ఒక్కోసారి తుప్పు మరకలు కూడా గమనించవచ్చు.

దీని నివారణకు 50 గ్రా. అన్న భేదికి 50 గ్రా. నిమ్మ ఉప్పు, 150 గ్రా యూరియా ఒక చేతి పంపులో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను చల్లుకోవాలి

.జె. విజయ్. సేద్య విభాగపు శాస్త్రవేత్త,
డా. ఎస్. వెంకటేశ్వర్ రావు సీనియర్ శాస్త్రవేత్త & హెడ్
కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట