Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మానుకోట నియోజకవర్గానికి సరైనోడు శంకర్ నాయక్

మహబూబాబాద్ ,జిల్లా ప్రతినిధి, జూలై 24,( నిజం న్యూస్):

మానుకోట నియోజకవర్గానికి శంకర్ నాయక్ సరైనోడు అని ఎక్కువ శాతం నియోజకవర్గ ప్రజలు అనుకుంటుంటే కొంతమంది ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీద ఇటీవల తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

పార్టీలో టికెట్ రాదు అనే వార్తలు పార్టీలోనే కొన్ని వర్గాల నుండి బలంగా వినిపిస్తున్నాయి.

అయితే ఈ 10సంవత్సరాలలో శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఏ పని చేయలేదు అని అనలేము. నియోజకవర్గానికి ఉన్న నాలుగు మండలాలలో చెప్పుకోదగ్గ పనులు అయ్యాయని కొందరు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఇక జిల్లా పరిధికి వస్తే పట్టణంలో మెడికల్ కాలేజీ, జిల్లా సమీకృత భవనం (కలెక్టరేట్), పట్టణంలోని వంద పడకల హాస్పిటల్ ను 300 పడకలకు అప్గ్రేడ్ చేయించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని ఒక వర్గం అంటున్నారు.

శంకర్ నాయక్ తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడని తనకు సన్నిహితులైన వారు చెప్పుకుంటూ ఉంటారు. ఏ కార్యకర్తలనైనా తన వారు అని నమ్మితే వారికోసం ఎంత దూరమైనా వెళ్లి వారి పనులను నెరవేర్చుతారని అంటారు.

మరి కొందరు నోటి దురుసుతనంతో చాలామందిని శత్రువులుగా చేసుకుంటారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మానుకోట నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో నాలుగు స్తంభాల ఆట నడుస్తుందని ఎవరికి సంబంధం లేని కార్యకర్తలు అంటున్నారు.

ఇదే పరిస్థితి ఎలక్షన్ల వరకు కొనసాగితే పార్టీ బలహీన పడే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు, కొందరు పార్టీ సీనియర్ కార్యకర్తలు అనుకుంటున్నారు.

అధిష్టానం ఈ పరిస్థితులను అత్యంత నిశితంగా గమనిస్తుందని అంటున్నారు. ఈ నాలుగు స్తంభాలాటలు రేపటి కాలంలో శంకర్ నాయక్ కు ఎవరు అండగా ఉంటారో ఎవరు తీవ్రంగా వ్యతిరేకిస్తారో కాలం నిర్ణయిస్తుందని మరికొందరు తటస్థ కార్యకర్తల మాట.

ఈ నాలుగు స్తంభాలాటలో శంకర్ నాయక్ విజయం సాధించి అధిష్టానమును మెప్పించి టికెట్ సాధిస్తారో లేదో వేచి చూద్దాం.