Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాలుడి ప్రాణం ఖరీదు రెండు లక్షలే…?

– వైద్యం వికటించి బాలుడు మృతి,?
– ఇంజక్షన్‌ డోస్‌ పెరగటం వల్ల బాలుడు మృతి చెందాడని బంధువుల ఆరోపణ
– సెటిల్మెంట్‌ పాత్రలో ఆర్‌ఎంపి డాక్టర్ల అసోసియేషన్‌…?
– చంపి సెటిల్మెంట్‌ చేస్తున్న వైద్య శాలలు..?

హుజూర్‌ నగర్‌, జూలై 23, (నిజం చెపుతాం) :
హుజూర్‌ నగర్‌ పట్టణంలో మఠంపల్లి రోడ్డులో ఉన్న డాక్టర్‌ బాబు వైద్యశాలలో వైద్యం వికటించి బాలుడు (3) మృతి చెందాడని మృతుని బంధువులు హాస్పటల్‌ ముందు ధర్నా నిర్వహించారు.

హాస్పిటల్‌ యాజమాన్యంను కాపాడటానికి ఆర్‌ఎంపీ అసోసియేషన్‌ రంగంలోకి దిగి ఎలాంటి కేసులు కాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఆస్పత్రి యాజమాన్యంతో మృతునికి సంబంధించిన మధ్యవర్తులు ఎలాంటి కేసు పెట్టకుండా ఉండాలంటే ఐదు లక్షలు ఇవ్వాలని అడగగా ఆస్పత్రి యాజమాన్యం 2 లక్షల ఇస్తానని చెప్పినట్లు సమాచారం…
అయితే డాక్టర్‌ బాబు గా పిలవబడుతున్న ఈ ఆర్‌ఎంపీకి వైద్యం చేయడానికి ఉన్న పర్మిషన్లు ఏంది.

అతనికి ఉన్న అర్హతలు ఏమిటో తెలియడం లేదు.. ఇదే ఆసుపత్రిలో రెండు సంవత్సరాల క్రితం వైద్యం వికటించి ఒక బాలుడు మరణించిన విషయం తెలిసిందే…
అప్పుడు కూడా ఎలాంటి కేసు కాకుండా ఇలా మధ్య వర్తుల ద్వారా బేరం కుదుర్చుకున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలోని పలు జిల్లాలో చాలా ఆసుపత్రులకు ఎలాంటి పర్మిషన్లు లేకున్నా వైద్యం నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఇంత జరుగుతున్నా.. తమకు తెలిసినా వీరిచ్చే కాసులకు ఆశపడి వీరిపై జిల్లా వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే మఠంపల్లి మండలం బిల్లా
నాయక్‌ తండ గిరిజన కుటుంబాలకు చెందిన రమేష్‌ నాయక్‌ స్వాతి రెండవ కుమారుడు శివ (3)కి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో హుజూర్నగర్‌ పట్టణంలోని మఠంపల్లి రోడ్డులో గల డాక్టర్‌ బాబు హాస్పిటల్‌ (ఆర్‌ఎంపి) తీసుకురాగా పేషెంట్‌ కు ఇచ్చేటటువంటి ఇంజక్షన్‌ ఒకరికి తెలియకుండా ఒకరు, ఇద్దరు హాస్పిటల్‌ సిబ్బంది ఇంజక్షన్‌ చేయడంతో డోస్‌ ఎక్కువై బాలుడు మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
బాలుడి మృతికి కారణమైన సంబంధిత వైద్య సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని హాస్పిటల్‌ ముందు మృతుని తల్లిదండ్రులు బంధువులు ధర్నా నిర్వహించడం జరిగింది. వెంటనే పోలీసులు హాస్పిటల్‌ వద్దకు చేరుకొని ఎటువంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకొని బాధితుల నుండి ఫిర్యాదు తీసుకోవడం జరిగింది.

హాస్పిటల్‌ యాజమాన్యం చేసిన తప్పును గుర్తించి, కొంతమంది మధ్య వర్తుల పాత్రలో హుజూర్నగర్‌ మండల ఆర్‌ఎంపీ అసోసియేషన్‌ సభ్యులు అవతారం ఎత్తి, పసివాడి ప్రాణానికి వెల కట్టడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది.

ఈ ప్రయత్నంలో భాగంగా బాధిత కుటుంబానికి రెండు లక్షలు ఇస్తామని తెలియజేయగా, ఐదు లక్షల వరకు బాధితుల తరఫున కొందరు అడిగినట్లు సమాచారం.. జరిగిన తప్పును సవరించుకోవడం కోసం ఒక పసివాడు ప్రాణానికి ఖరీదు కట్టి సంబంధిత వైద్యులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేయగా పోయినవాడు ఎలా రాడు కదా కనీసం ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చినా ఎంతో కొంత మేలు జరుగుతుంది కదా అని కొంతమంది పలుకులు పలుకుతున్నారు.

ఇటువంటి చర్యలు గతంలో కూడా చాలా ఆస్పత్రుల్లో జరిగినటువంటి దాఖలాలు ఉన్నా జిల్లా యంత్రాంగం సదరు హాస్పిటల్‌ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

ప్రాణాలను డబ్బుతో ఖరీదు కట్టి చేతులు దులుపుకోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వైద్యం చేసే వారికి ఉన్నటువంటి అర్హత ప్రకారం ఎటువంటి పేషెంట్లకు తీసుకోవాలి అనేదానిపై నిబంధన ఉండాలని అవగాహన లేకున్నా డబ్బు కోసం వైద్యం చేసి ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసం అని దీనిపై వైద్యశాఖ దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇటువంటి సంఘటనలో చట్టపకారం చర్య తీసు కుని శిక్షించినప్పుడే మరొకరికి న్యాయం జరుగుతుందని తప్పు చేసిన ప్రతిసారి ప్రాణం ఖరీదు కట్టి చేతులు దులుపుకోవడం వల్ల యాజమాన్యానికి చట్టం అంటే గౌరవం లేకుండా పోతుందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.