అరెస్ట్ చేస్తే చేసుకోండి…జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
– ఏపీ ప్రభుత్వానికి జనసేనాని సవాల్ !
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం , 20, (నిజం చెపుతాం ) బ్యూరో::
తనను అరెస్ట్ చేసుకోవచ్చని.. చిత్రవధ చేసుకోవచ్చని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైసీపీ కి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ గురువారం జనసేన పార్టీలో చేరిన సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
వాలంటీర్లపై తాను చేసిన వ్యాఖ్యల అంశంపై కేసులు పెట్టారు. అంతేకాక పవన్ ను విచారించాలని జీవో ఇచ్చారని..అరెస్ట్ చేసే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఇలాంటి కేసులకు భయపడితే తాను పార్టీ ఎందుకు పెడతానని ప్రశ్నించారు. తనను ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
వాలంటీర్లకు అధిపతి ఎవరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరిస్తున్న డేటా మొత్తం ప్రైవేటు సంస్థ అయిన ఎఫ్. వో. ఏకు వెళ్తుందని.. ఏ జీవో కింద దీన్ని ప్రైవేటుపరం చేశారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
నేను మాట అన్నానంటే.. అన్నింటికీ సిద్ధపడే అంటానని స్పష్టం చేశారు. వాలంటీర్లు సేకరించే సమాచారం అంతా డేటా ప్రొటెక్షన్ కిందకు వస్తుందన్నారు. అలాంటి పబ్లిక్ డేటా నానక్ రామ్ గూడలోని ఎఫ్వోఏ సంస్థకు వెళ్తోందన్నారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడానని తప్పు చేసిన వాళ్లు శిక్షకు గురికాక తప్పదన్నారు.
వాలంటీర్లు ఓ ఎనిమిదేళ్ల పాపను రేప్ చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. ఓ వాలంటర్ తన ఇల్లు వైడెనింగ్ లో అన్యాయంగా కూల్చేశారని తనను కలిసి చెప్పిందని తర్వాత నెలకే ఆమె అన్నయ్య అనుమానాస్పదంగా చనిపోయారన్నారు.
ఇలాంటి దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ లేదన్నారు. తనను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇచ్చారని.. మరి మర్డర్లు చేసిన వారికి ప్రాసిక్యూషన్ ఉండదా? అని ప్రశ్నించారు.
పొరపాటున అత్యాచారాలు జరుగుతాయన్నారు. వారిని ప్రాసిక్యూట్ చేయరా అని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించే సమాచారాన్ని ఏ ఏక్ట్ కింద ప్రైవేటు పరం చేశారు..
దానిపై విచారణ జరగాల్సిందేనని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. గతంలో కూడా అవినీతి ఉంది కానీ కొండలు దోచేంత అవినీతి లేదని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.