దోమలు బాబోయ్ దోమలు
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూలై 17,( నిజం న్యూస్):
మహబూబాబాద్ పట్టణంలో ఈ వర్షాకాలంలో విపరీతమైన దోమలు విజృంభించి ప్రజలపై దాడి చేస్తున్నాయి. గతంలో రాత్రిపూట ప్రజలను కుట్టే ఈ దోమలు ఇప్పుడు ఉదయం పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రజలపై దాడి చేసి వారి రక్తాన్ని లాగేస్తున్నాయి.
సన్నటి నల్లని ఈ దోమలు కుడితే “డ్రగ్ రెసిస్టెన్స్ మలేరియా”అనే కొత్త వ్యాధి వస్తుందని డాక్టర్లు భయాందోళన చెందుతున్నారు. జిల్లా పాలనాధికారి వర్షాకాలానికి ముందే హాస్పిటల్ డాక్టర్లతో సంబంధిత మున్సిపాలిటీ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంత చెప్పినా సంబంధించిన మున్సిపాలిటీ అధికారులకు “చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా” ఉన్నదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
వర్షాకాలం వచ్చి రెండు నెలలు కావస్తున్న మహబూబాబాద్ మున్సిపాలిటీ ఇప్పటికీ కళ్ళు తెరవకపోవడం శోచనీయం. దీనివలన పట్టణ మున్సిపాలిటీ అధికారులు ప్రజల విమర్శలకు గురవుతున్నారు. ఇప్పటివరకు పట్టణంలో ఉన్న 36 వార్డులో ఏ ఒక్క వార్డులో కూడా దోమల మందు చల్లించలేదు అని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఈ కొత్త రకం సన్నటి దోమలు కుట్టడం వలన పిల్లలు ,పెద్దలకు ఎక్కడ కొత్త వ్యాధులు వస్తాయి ఏమోనని పట్టణ ప్రజలు భయపడుతున్నారు. పట్టణంలోని శివారు తండాలలో కాలనీలలో ఈ వర్షాలకు నీరు నిల్వ ఉండి వాటిపై దోమలు కాపురం చేసి గుడ్లు ( లార్వా) సంతానోత్పత్తిని పెంచుతాయి.
నీరు నిల్వ ఉండే కాలనీలలో తండాలలో దోమల నిర్మూలన మందును చల్లి వాటిని నిర్మూలించవలసిన మున్సిపాలిటీ ఇప్పటివరకు నిద్రమత్తులో జోగుతుంది. ఈ విషయంలో మున్సిపాలిటీ కమిషనర్ ఏమి సమాధానం చెబుతుందో అని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికైనా మున్సిపాలిటీ కమిషనర్ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ విషయంలో జిల్లా పాలనాధికారి తగు చర్యలు తీసుకుని సంబంధిత అధికారులకు వర్షాకాలంలో తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు జారీ చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.