నేటి నుండి రైతుభీమా దరఖాస్తుల స్వీకరణ
రైతు బీమా.. పక్కాగా ధీమా
వ్యవసాయంపై ఆధారపడ్డ అన్నదాతల కుటుంబాలకు రైతుబీమా పథకం చేదోడుగా నిలుస్తోంది.
మహబూబాబాద్ బ్యూరో జూలై 10 నిజం న్యూస్
కుటుంబానికి పెద్ద దిక్కు అకస్మాత్తుగా ఏదైనా కారణంతో చనిపోతే ఆ కుటుంబమంతా రోడ్డున పడుతోంది. ఏమీ చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బీమా పథకాన్ని అమలుచేస్తోంది.
రూ.5 లక్షల చొప్పున అందిస్తూ ఆసరాగా నిలుస్తోంది. 18-59 మధ్య వయసున్న పట్టాదారులు అర్హులు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఇందులో కొత్తగా చేరేందుకు పట్టాదారులకు అవకాశం కల్పించింది. కర్షకుల నుంచి జులై 10 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించి ఆగస్టు 5 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
రైతు కుటుంబాల్లో పెద్ద దిక్కుగా ఉండి అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు వారికి చేదోడుగా నిలిచేందుకు ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేస్తోంది. 2018 ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. మృతుడి నామినీకి రూ.5 లక్షల బీమా వర్తించేలా నిర్ణయించారు.
కర్షకుడు చనిపోయినపుడు వ్యవసాయ అధికారులు వివరాలు సేకరించి నామినీ ఖాతాలో పరిహారం జమయ్యేలా చేస్తున్నారు. తొలి రెండేళ్ల పాటు బీమాకు శాఖ నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులు స్వీకరించారు.
2020 నుంచి ప్రతి వానాకాలంలో ఒకసారి మాత్రమే అర్హుల నుంచి సేకరిస్తుండటం గమనార్హం. ఇందులో భాగంగా తాజాగా దరఖాస్తుల స్వీకరణకు ప్రకటన వెలువడింది. పథకంలో చేరిన రైతు పేరిట ప్రభుత్వం ఎల్‌ఐసీకి రూ.3,457 ప్రీమియం చెల్లిస్తోంది.
వివరాలు సేకరిస్తున్న ఏఈవోలు..
నిబంధనలు ఇలా
లబ్ధిదారుడి వయసు పక్కాగా తెలుసుకునేందుకు ఆధారే ప్రామాణికం. ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలోనిది మాత్రమే బీమాకు అవకాశం ఉంటుంది. స్వయంగా బీమా ఫారాన్ని వివరాలతో నింపి సంతకం చేయాలి.
పట్టాపాసు పుస్తకం లేదా తహసీల్ కార్యాలయం కాపీ, ఆధార్ కార్డు, నామినీ ఆధార్, ఖాతా వివరాలను సంబంధిత వ్యవసాయ కార్యాలయంలో గానీ సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించాలి. అధికారులు ఆయా వివరాలను సంబంధిత వైబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తారు. గడువులోపు ముందుకు రాకపోతే మళ్లీ ఏడాది వరకు వేచి ఉండాల్సిందే.
అవగాహన కల్పించి
నాలుగు జిల్లాల్లో ఆయా మండలాలు, గ్రామాల వారీగా ఏవోలు, ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఉదయం క్షేత్ర పర్యటన, మధ్యాహ్నం క్లస్టర్ కార్యాలయాల్లో ఏఈవోలు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. కొత్తగా పట్టా పుస్తకం పొందిన వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 59 ఏళ్లు నిండిన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
రైతుబీమా పథకంలో చేరడానికి మళ్లీ అవకాశం వచ్చింది. వ్యవసాయశాఖ నుంచి దరఖాస్తుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. అర్హులైన వారు తప్పకుండా గడువులోగా ముందుకు రావాలి. అన్నదాతలు ముందుకొచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.