Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రస్తుతం ఉన్నది 105 టీఎంసీలు మాత్రమే.

వానాకాలంలో ప్రాజెక్టుల కింద పంటల సాగుకు జులై, ఆగస్టు నెలలు కీలకం. ఈ సమయంలో తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల కింద కనీసం 175 టీఎంసీలు అవసరమవుతాయని నీటిపారుదల శాఖ అంచనా.

కానీ ప్రస్తుతం ఉన్నది 105 టీఎంసీలు మాత్రమే. ప్రాణహితకు ప్రవాహం మొదలవ్వడం, కాళేశ్వరం ఎత్తిపోతల మొదటి లిఫ్టు మేడిగడ్డ నుంచి నీటి మళ్లింపు సోమవారం నుంచి ప్రారంభం కావడంతో గోదావరిలోని ప్రాజెక్టులను కొంతవరకైనా ఆదుకొంటుంది.

కానీ కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టులు మరికొంతకాలం వేచిచూడక తప్పని పరిస్థితి. తెలంగాణలో నిర్మాణం పూర్తయిన, పూర్తయ్యే దశలో ఉండి కొంత ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్న భారీ ప్రాజెక్టుల కింద 56 లక్షల ఎకరాలు ఉండగా, 42 లక్షల ఎకరాల సాగుకు ప్రస్తుత వానాకాలంలో నీరివ్వాల్సి ఉంటుందని అంచనా. ఇందులో వరిసాగు, ఆరుతడి పంటలకు కలిపి జులై, ఆగస్టు నెలల్లో అవసరమైన జలాలకంటే తక్కువగా ఉండటంతో ఓ కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్లడానికి నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది.

*కృష్ణా బేసిన్‌లో…*

కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌, జూరాల ప్రాజెక్టుల ద్వారానే ఎక్కువ ఆయకట్టు సాగవ్వాల్సి ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనపుడు నాగార్జునసాగర్‌ కింద ఆగస్టులో నీటిని విడుదల చేసిన సందర్భాలున్నాయి. ఒక సంవత్సరం ఖరీఫ్‌కు కాకుండా ముందస్తు రబీకి నీటిని విడుదల చేశారు. అయితే గత ఏడెనిమిదేళ్లుగా ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. ఈ ప్రాజెక్టు కింద 6.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వచ్చే 2 నెలలకు 30 టీఎంసీలకు పైగా అవసరం కాగా, ప్రస్తుతం 16 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలం నుంచి నీటిని తీసుకొనే కల్వకుర్తి ఎత్తిపోతల కింద 3 లక్షల ఎకరాలకు 17 టీఎంసీలు అవసరం. అయితే శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహంపైనే కల్వకుర్తికి నీటివిడుదల ఆధారపడి ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి ఎక్కువ ఆయకట్టుకు నీటిని ఇవ్వాల్సి ఉంది. దీనికింద లక్ష ఎకరాలతో పాటు భీమా ఎత్తిపోతల కింద లక్షన్నర ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.20 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్‌ కింద 35 వేల ఎకరాలు ఉంది. కనీసం 25 టీఎంసీలు ఉంటే కానీ వచ్చే 2 నెలలు సర్దుబాటు చేయడం వీలుకాదు. ప్రస్తుతం 7 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది.

*గోదావరి బేసిన్‌లో…*

 

గోదావరి బేసిన్‌లో అత్యధికంగా శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు కింద 9 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉంది. ఇందులో 20 టీఎంసీలు అందుబాటులో ఉండగా, వచ్చే 2 నెలలకు 39 టీఎంసీలు అవసరం. కాళేశ్వరం నుంచి మేడిగడ్డ ద్వారా మళ్లించే నీటిని, పునరుజ్జీవ పథకం ద్వారా శ్రీరామసాగర్‌కు చేర్చడంతో సమస్యను అధిగమించవచ్చని నీటిపారుదల శాఖ భావిస్తోంది. ప్రాణహితకు 20 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహం ఉండటంతో సోమవారం 10 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారు. అన్నారం బ్యారేజీలో మట్టం పెరిగిన తర్వాత సుందిళ్లకు, ఇక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోస్తారు. ఎల్లంపల్లిలో ఇప్పటికే 11 టీఎంసీలు ఉన్నాయి. ఈ ఏడాది కాళేశ్వరంతో పాటు పునరుజ్జీవ పథకం కూడా వినియోగంలోకి రానుంది. కాళేశ్వరం కింద పూర్తిస్థాయిలో ఆయకట్టు అభివృద్ధి కానందున నీటి ఎత్తిపోసే అవసరం తక్కువ. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి అటు పునరుజ్జీవ పథకం ద్వారా శ్రీరామసాగర్‌కు, ఇటు మధ్యమానేరుకు మళ్లించి ఆయకట్టుకు నీరు సరఫరా చేయడానికి అవకాశముంది. శ్రీరామసాగర్‌లోకి ప్రవాహం వచ్చేలోగా ఎంత నీటిని ఎత్తిపోయగలరు, ఆయకట్టుకు ఎంత విడుదల చేస్తారో చూడాల్సి ఉంది. శ్రీరామసాగర్‌ రెండోదశ కింద 3.5 లక్షల ఎకరాలు సాగవ్వాల్సి ఉంది. దీనికింద వచ్చే 2 నెలలకు 12 టీఎంసీలు అవసరమని అంచనా. ఎల్లంపల్లిలో ఉన్న నీరు వచ్చే 2 నెలలు ఆ ప్రాజెక్టు కింద అవసరాలకు సరిపోయే అవకాశముంది. సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల కింద ప్రవాహాలు ప్రారంభమయ్యేదాకా ఎదురు చూడాల్సిందే.