Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పాఠశాల సమయాల్లో మార్పులు చేసే అవకాశం

పాఠశాల సమయాల్లో కొన్ని మార్పులు చేసే ఆలోచనలో పాఠశాల విద్యాశాఖ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి.

హైదరాబాద్‌లో కొంత ముందుగా మొదలవుతాయి. ‘‘ప్రాథమిక పాఠశాలల్లో చదివేది చిన్నారులైనందున వారు ఉదయం త్వరగా నిద్ర లేవరు. అందువల్ల వారికి ఉదయం 9.30 గంటలకు తరగతులకు మొదలు కావాలి. ఉన్నత పాఠశాలల్లో ఉండేది పెద్ద పిల్లలైనందున ఉదయం 9 గంటలకు మొదలుకావాలి. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా బడి సమయాలు ఉన్నాయి’’ అని కొందరు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తెచ్చారు.

అందువల్ల అన్ని పాఠశాలలను ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో సమయాల మార్పుపై ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.

*భిన్న వాదనలు…*

పాఠశాలల సమయాలు మార్చాలంటే ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. నిపుణులతో చర్చించి…అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వ పాఠశాలలకు మరింత నష్టం జరుగుతుందని కొందరు సూచిస్తున్నారు. ‘‘ప్రైవేట్‌ పాఠశాలలు ఉదయం 7.30, 8 గంటలకే పిల్లల్ని వాహనాల్లో ఎక్కించుకొని వెళ్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు అందుకు భిన్నంగా ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉదయం 9 గంటల లోపే పొలం పనులకు, కూలి పనులకు వెళ్తారు. అలాంటప్పుడు ఆలస్యంగా బడులు తెరిస్తే ఇబ్బంది అవుతుంది. ఉదయం సాధ్యమైనంత త్వరగా తరగతులు మొదలైతేనే పాఠాలు బాగా అర్థమవుతాయి’ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

‘‘ఉన్నత పాఠశాలలకు అనేక మంది పిల్లలు పొరుగు ఊళ్ల నుంచి వస్తారు. అందుకే అరగంట ఆలస్యంగా తెరుస్తారు. ప్రాథమిక పాఠశాలలకు పొరుగు ఊళ్ల నుంచి పిల్లలు రారు. ఈవిషయాన్ని గమనంలోకి తీసుకోవాల్సి ఉంది’’ అని మరికొందరు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.