వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో యాదాద్రికి చోటు
సి.హెచ్.సాయిప్రతాప్)
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రి ఆలయాన్ని పుననిర్మించింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అలనాటి వైభవం చెక్కుచెదరకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా నిర్మించారు.
ఇప్పటి వరకు ఏ ఆలయంలో లేని విధంగా పూర్తిగా నల్లరాతి (కృష్ణ) శిలలతో నిర్మించిన ఏకైక ఆలయం యాదాద్రినే అని పండితులు ,శిల్పులు, స్తపతులు మొదలు సామాన్య భక్తుల వరకు చెబుతున్నారు. ఆలయంలో గుళ్లు, గోపురాలే కాదు ఆలయ గోడలు కూడా పూర్తిగా నల్లరాతితోనే నిర్మించారు. యాదాద్రి ఆలయ నిర్మాణానికి మొత్తం 2లక్షల టన్నుల నల్లరాతిని వాడారు. కాంబోడియాలో పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయాలు ఉన్నా అక్కడ ఎర్రరాతి శిలతో నిర్మించగా… ఆలయ గోపురాలు కూడా యాదాద్రి కంటే చిన్నవిగానే ఉన్నాయని స్తపతులు చెబుతున్నారు.
ఆధ్యాత్మిక శోభ, శిల్పాకళా సౌందర్యం ఉట్టిపడేలా యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణం జరిగింది. ఆళ్వారుల నిలువెత్తు విగ్రహాలు ఈ గుడి ప్రత్యేకత. ఎక్కడా సిమెంట్, ఇటుక వాడకుండా… పూర్తిగా నల్లరాతిని… కర క్కాయ, బెల్లం, సున్నం, అలివేరా, జనపనార గుజ్జు మిశ్రమాన్ని వినియోగించి శిల్పం, శిల్పంకు మధ్యన ప్లాస్టింగ్ చేశారు.తెలంగాణ తిరుమలగా భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో తేలియాడించేందుకు యాదాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన అతిపెద్ద ఆలయం యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం. అక్షరాల రూ.1200కోట్లతో యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణం చేపట్టారు.
దీనిని పంచరామ నరసింహ క్షేత్రంగా పూజిస్తారు.స్కంద పురాణం ప్రకారం, విష్ణువు యొక్క గుహలో ఆలయం ఉంది, ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం అజేయమైన సుదర్శన చక్రం ఈ ఆలయం వైపు మార్గనిర్దేశం చేస్తు భక్తులకు దిక్సూచిలాగా ఉంది.ఇక్కడ ఆరాధన, పూజలను పంచరాత్ర ఆగమము ప్రకారం నిర్వహిస్తున్నారు.ఈ ప్రసిద్ధ ఆలయానికి స్థానచార్యుడిగా పని చేసిన దివంగత శ్రీ వంగీపురం నరసింహచార్యులు సూచించిన విధంగా ఇక్కడి పూజ విధానాలు జరుగబడుతున్నాయి.
ఈ క్రమంలో ఆ యాదాద్రి ఆలయం ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. తాజాగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి లభించిన ఈ గుర్తింపు సంబంధించిన సర్టిఫికెట్ ను తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవం నాడు ఆలయ ఈవో గీతారెడ్డికి ఆ సంస్థ ప్రతినిధులు అందించారు.