Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణలో నవంబరులోనే అసెంబ్లీ ఎన్నికలు ?

ఈ రోజు తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఒక సంచలనాత్మక అభివృద్ధి జరిగింది. 2023లోనే ఎన్నికల నగారా మోగుతుందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటినుంచే ఏర్పాట్లను షురూ చేసింది

భారత ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఈ రోజు నుంచీ మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటన ప్రారంభిస్తుందని తెలుస్తోంది. . రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధతపై ఈ బృందం విస్తృతంగా సమాలోచనలు చేస్తుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించనున్నారు అని సమాచారం. తెలంగాణలో 2023 లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ సంవత్సరం నవంబర్ లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటం తెలుస్తోంది.

ఓటర్ల నమోదు మొదలుకొని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల తతంగంపై శిక్షణ ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో మూడు సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తున్న అధికారుల బదిలీలపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. . జులై 31వ తేదీ లోపు ఈ బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లుగా సమాచారం.

Also read: ఈ పాపం ఎవరిది…?

ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహాన్ని అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈసీఐ సూచించనున్నది. అందుకు అనుసరించవలసిన వ్యూహాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

అయితే ఈసారి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయనే ప్రచారం జోరుగా జరిగింది. ఎందుకంటే గతంలో 2018 సెప్టెంబర్ 6న కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అయితే ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని కెసి ఆర్ చెబుతున్నారు. కాబట్టి ముందస్తుకు వెళ్లినా వెళ్లకపోయినా ఈ డిసెంబర్ లోపే రాష్ట్ర ఎన్నికలు పూర్తి కానున్నాయి

ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ గెలుపు కోసం సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటినుంచే ఎన్నికల వ్యూహలను రచిస్తూ స్పీడ్ పెంచాయి.రాబోయే రోజులలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనున్నదని అంచనా.అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నది

. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా డిక్లరేషన్ల పేరుతో ఎన్నికల హడావిడిని ప్రారంభించింది. ఇక తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీలో మాత్రం కాస్త స్తబ్దత నెలకొన్నది.అయితే రాబోయే రోజులలో ఆ పార్టీ మరింత స్పీడ్ పెంచనున్నదని తెలుస్తోంది.

సాయిప్రతాప్