పనితీరు మార్చుకోకపోతే టిక్కెటు రాదు
(సి.హెచ్.సాయిప్రతాప్)
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు త్వరలోనే రానున్న నేపధ్యంలో ఇటీవల జరిగిన సమీక్షా సమావేసంలో జగన్ ఎమ్మెల్యేల పని తీరుపై నిష్పక్షపాతంగా సమీక్షించారు. ఈసారి 18 మందికి జగన్ తలంటారని తెలుస్తోంది. ఆ పదిహేను మందికి పనితీరు సరిగా లేదని, సాధ్యమైనంత త్వరగా మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం, పార్టీ అతి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపలో ఈ ఎమ్మెల్యాలు అనుకున్న రీతిలో వెనుకబడ్డారని సాక్ష్యాధారాలు చూపించారట.
Also read: శంకరమ్మకు ఎమ్మెల్సీ
“సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది, మరో 9 నెలల్లోనే ఎన్నికలు వచ్చేస్తాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు ఏపీ సీఎం జగన్. మన టార్గెట్ 175 అని మరోసారి గుర్తు చేశారు. పనితీరు మెరుగుపరచుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కష్టమని తేల్చేశారు.
ఎన్నికల సమీపించే కొద్దీ ఎమ్మెల్యేలతో తరచూ సమావేశమౌతూ వివిధ అంశాలపై సమీక్ష జరుపుతున్నారు వైఎస్ జగన్. 2024 ఎన్నికల్లో175కు 175 సీట్లు సాధించి తీరాలని పదే పదే చెబుతున్న జగన్..ఇవాళ జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మరోసారి టార్గెట్ గుర్తు చేశారు. అక్టోబర్ వరకూ గడువిచ్చి పనితీరు ఇకనైనా మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈలోగా గ్రాఫ్ పెరిగితే సరి లేకుంటే మీతోపాటు పార్టీకు కూడా నష్టమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఇకపై ప్రతీ నెలా గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించనున్నట్లు, ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ఆధారంగా ఎవరెవరికి వచ్చే ఎన్నికలలో టిక్కట్లు ఇవ్వాలనేది నిర్ణయించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
చివరిసారిగా ఒకే అవకాశం ఇస్తానని, అప్పటికీ మారకపోతే టికెట్ రాదని ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పేశారని తెలుస్తోంది. పనితీరు బాగుంటే వచ్చే ఎన్నికల్లోనూ వారికే టికెట్ దక్కుతుందని చెప్పారు. కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారని, కోట్ల మంది పేదలకు మంచి జరుగుతోందని వివరించారు. ఆ మంచి కొనసాగాలంటే పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని, అలా జరగాలంటే ఎమ్మెల్యేలు గెలవాలని, గెలిచే వారికే టికెట్లు అని కుండబద్దలు కొట్టారు.