Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ తో షర్మిళ మైత్రి

పొత్తా లేక విలీనమా?

త్వరలోనే ఊహాగానాలకు చెక్ ?

తెలంగాణాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కర్నాటకలో విజయం సాధించాక కాంగ్రెస్ లో ఉత్సాహం ద్విగుణీకృతమవుతొంది. అధికార బి ఆర్ ఎస్ ను బలంగా ఢీకొట్టాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది.

ఈ నేపధ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ఊహాగానాలు, ప్రచారాల నడుమ ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోమారు డికె.శివకుమార్‌తో ఇటీవల భేటీ అయ్యారు.

కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శివకుమార్‌కు అభినందనలు తెలిపిన షర్మిల మరోమారు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

Also read: పొలం లో కొయ్యలకు నిప్పు….మద్యం దుకాణం దగ్ధం

అంతేకాకుండా వై ఎస్ షర్మిళ రాహుల్ గాంధీతో కూడా భేటీ అవనున్నారన వార్తలు ఇప్పుడు వెలువడుతున్నాయి. స్వర్గీయ వై ఎస్ ఆర్ అభిమానుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ఈ వ్యూహ రచన చేస్తోంది.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో షర్మిల పార్టీ విలీనం కాకుండా పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో వైఎస్సార్‌టీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న చర్చల నడుమ, వైఎస్ షర్మిల సోమవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో బెంగళూరులోని ఆయన నివాసంలో ఇటీవలసమావేశమయ్యారు. ఇద్దరి మధ్య విలీనం, పొత్తుల చర్చలు జరిగినట్లు సమాచారం.

అనేక పత్రికలలో ఈ పొత్త్, విలీనం లపై వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే షర్మిళ రాహుల్ గాంధీని కలిసి ఈ ఊహాగానాలకు చెక్ పెడతారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలతో మైత్రీ బంధానికి ఉవ్విళ్లూరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిరాదరణే అందుకు కారణం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పట్టుమని పది స్థానాలు గెలిచే పరిస్థితి ఉందని కూడా కచ్చితంగా చెప్పలేని దురవస్థలో ఏపీలో హస్తం పార్టీ ఉంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల వైపు కాంగ్రెస్ పార్టీ ఆశగా ఎదురుచూస్తోందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

జులై 8న (వైఎస్సాఆర్ జయంతి) ఇడుపులపాయకు సోనియా, రాహుల్ గాంధీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అదే రోజు వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్ సమాధి సాక్షిగా షర్మిల విలీనం చేయనున్నారనే ప్రచారం నెట్టింట ఊపందుకుంది. ఒకవేళ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె ఎలాంటి పాత్ర పోషించనున్నారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో ఈ మేరకు చర్చలు ఫలించినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ తో కలవాలని కొద్ది రోజుల క్రితం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చొరవతో నేరుగా ప్రియాంక నుంచి ఆఫర్ వచ్చింది.

ఆ సమయంలోనే తెలంగాణ టు ఏపీ రాజకీయాల్లో షర్మిలకు ప్రాధాన్యతపైన హామీ దక్కిందని సమాచారం.తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ షర్మిల పార్టీ ఏర్పాటు చేసారు. సుదీర్ఘ కాలం పోరాటం చేసారు. కానీ, ఆశించిన మద్దతు లభించలేదు. రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తరువాత తెలంగాణలో ఆ పార్టీ నేతలు వేగంగా అడుగులు వేస్తున్నారు.

(సి.హెచ్.సాయిప్రతాప్)