Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉమ్మడి పౌరస్మృతిపై చర్చించాల్సిందే ! 

కులాలు మతాలు ఉండవద్దంటున్న వారే ఉమ్మడి పౌరస్మృతి అనగానే ఉలిక్కిపడుతున్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టులు ముందుంటారు. వారి తరవాత మైనార్టీ ముస్లిం ఓట్ల భయంతో కాంగ్రెస్‌ తదితర పార్టీలో జతకడతాయి. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అన్న పదం రాగానే ఈ పార్టీలకు వణుకు పుడుతుంది.

దేశం ఏమైనా ఫర్వాలేదు. దేశంలో ఓట్లతో లబ్ది పొందడమే వారికి కావాలి. కులాలు వద్దంటారు. మతాలన్నీ సమానమంటారు. అందరిలో ప్రవహించేది ఒకే రక్తం అంటూ గొంతు చించుకుంటారు. చట్టం వద్దకు వచ్చే సరికి కులాలు మతాల ఆధారంగా చట్టాలు ఉండాలంటారు.

బిసిలకు వేరు…ఎస్పీలకు వేరు..మైనార్టీలకు వేరు..ఇలా అనేక రకాల చట్టాలు ఉండాలని కోరుకుంటున్న రాజకీయ నేతలకు బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. ప్రజలంతా ఒక్కటే అన్న భావన పెరుగుతోంది. ప్రజలంతా ఒకే విధమైన చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే. కులాలు, మతాల వారీగా చట్టాలను అమలు చేయడం కుదరదని గుర్తించాలి.

ఒకేదేశం..ఒకే చట్టం నినాదం చట్టంగా మారితేనే..దేశంలో ఐక్యత సాధిస్తాం.
కుల, మతాచారాలు వేరు. చట్టాలు వేరు. ఒకరి ఆచారాలను మరొకరు గౌరవించాల్సిందే. ఎవరి అంతర్గత ఆచారాలను కూడా విమర్శించడం లేదా తక్కువ చేయడం సరికాదు. దానికీ చట్టాలకి తేడా ఉంది. ఉమ్మడి పౌరస్మృతి అంటే ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించాలి.

ప్రపంచం లో అనుసరిస్తున్న విధానాలు పరిశీలించాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా కఠినంగా ముందుకు సాగాలి. దొంగతనాలు, దోపిడీలు, పెళ్లిళ్లు, విడాకులు వంటి విషయాల్లో చట్టాలు మానవులందరికీ ఒకే రకంగా ఉండాలి. కులానికో,మతానికో పద్దతి అంటూ ఉండరాదు. దీనిపై ప్రజల్లో కూడా చర్చకు ఆస్కారం రావాలి.

చర్చకు పెడితే ఇప్పటివరకు ఉన్న అనేక అపోహలు తొలగిపోతాయి. మోడీ సర్కార్‌ గత తొమ్మిది సంవత్సరాలుగా ఉమ్మడి పౌరస్మృతి గురించి చెబుతున్నా నేటికీ దానిని చట్టరూపంలోకి తీసుకురాలేదు. రాజ్యాంగబద్ధమైన నిర్ణయం ఇప్పటికీ తీసుకో లేదు. ఉమ్మడి పౌరస్మృతిని ముస్లింలు లేదా ఇతర మతం వారెవరైనా గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అసవరం కూడా లేదు. మానవులుగా మన హక్కులకు భంగం కలగ కుండా చూడాలి. ఉమ్మడి పౌరస్మృతి అనగానే ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు లేదా ఆరోపణలను ప్రజలే తిప్పి కొట్టాలి. ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు పాల్పడుతున్న రాజకీయ పార్టీల తీరును ప్రతి ఒక్కరూ ఎండగట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే మతప్రాతిపదికన దేశం విచ్ఛిన్నం అయ్యింది.

ఇంకా కులాలు, ప్రాంతాలుగా, మతాలుగా దేశాన్ని విబిజించాలన్న భావన నుంచి బయటపడాలి. ప్రజలంతా ఒక్కటిగా చట్టానికి లోబడే వ్యవహారాల్లో కులమతాలకు ప్రాధాన్యం ఉండరాదు. ఏ మతానికి చెందిన వారయినా ఇతర మతాల వారితో సఖ్యంగా ఉండాల్సిందే. పరస్పరం గౌరవించు కోవాల్సిందే. కులం,మతంపట్టింపులు లేనివారు కూడా దీనిని బలంగా నమ్ముతున్నారు.

దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు వేరు. ఆర్థికంగా వెనకబడిన వారిని ఆదుకోవడం వేరు. ప్రజల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా వారికి ప్రభుత్వ పథకాలు అందాల్సిందే. కులాల వారీగా పథకాలు అన్నది సరికాదు. ఆర్థిక వెనకబాటు కారణంగా ఏ కులమైనా..ఏ మతమైనా లబ్ది పొందాల్సిందే. ఉమ్మడి చట్టం లేకుంటే రానురాను ఇంకా కులాలు, మతాల వారిగా చట్టాలు కావాలని కోరేవారి డిమాండ్‌ పెరుగుతుంది. మేం ఫలాన మతం లేదా కులాల వారం కనుక..మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి కనుక మాకు చట్టం వేరుగా ఉండాలన్న డిమాండ్‌ వచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. హిందూమతంలోనే కులాల వారీ భిన్న ఆచారాలు, భిన్న వ్యవహారాలు ఉన్నాయి. వీరిని వర్గాలుగా గుర్తించి ప్రత్యేక చట్టాలను రూపొందించలేదం.

ఇది కూడా చదవండి….తొందరపడొద్దు. అప్పుడే విత్తనాలు విత్తొద్దు

కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే అదేదో ముస్లింలకు సంబంధించిందని ఇప్పటికీ గోల చేస్తున్నారు. అక్కడి కొన్ని పార్టీలు ఇంకా 370 పునరుద్దరణ జరగాలని కోరుకుంటున్నాయి. వారికి ప్రజల బాధలు పట్టవని గుర్తించాలి. దేశంలో ఒక్కో ప్రాంతానికి ప్రత్యేక చట్టాలు ఉంటే ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో కశ్మీర్‌ పాఠాలు చెబుతాయి. దేశం నుంచి విడివడ్డ పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వేరుగా చెప్పనక్కర్లేదు.

ఒక కులానికి చెందిన వారు మరో కులం, మతానికి చెందిన వారిని వివాహం చేసుకో కూడదని తీర్మానాలు చేస్తున్న పంచాయత్‌లు సాగుతూనే ఉన్నాయి. పరువు హత్యలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ సమ్మతమా అన్నది ఆలోచన చేయాలి. ఒకప్పటి సతీసహగమనాన్ని తొలగించాం.అంటరానితనాన్ని రూపుమాపం. అస్పృశ్యతను రూపుమాపుకున్నాం. ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి. ఏకధృవ ప్రపంచం ఏర్పడ్డది.

ఇలాంటి సందర్భలో ప్రజలంతా ఒక్కటే అన్న భావన వచ్చింది. అయినా ఇంకా ఎవరికి వారు తమ కులాన్ని, మతాన్ని పవిత్రంగా మార్చాలని చూస్తున్న తీరు ఉపేక్షించరాదు.అందుకే చట్టాలు పటిష్టంగా ఉండాలి. కఠినంగా వాటిని అమలు చేస్తూ ఉండాలి. ఇప్పటికే రాష్టాల్ర వారీగా చట్టాలు ఉన్నాయి. వీటినీ సవిూక్షించాలి.

దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలి. ప్రజలను ఒక్కటి చేసేలా చట్టాలు ఉండాలి. రాష్టాల్రు ఇష్టం వచ్చినట్లుగా చట్టాలు చేయడం, బుజ్జగింపు చర్యలు తీసుకోవడం సరికాదు. ఈ అసమానతలు తొలగాలి.ఇలాంటి స్థితిలో అందరూ సమానమే, ఒకటే అనే భావనను అంగీకరించాల్సిందే. అప్పుడే దేశం ఒక్కటిగా ఉంటుంది.

ఉమ్మడి పౌరస్మృతి మాత్రమే దీనికి పరిష్కారం చూపగలదు. దీనికోసం ఇంకా కాలయాపనచేయడం సరికాదు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంటూనే..దేశహితం లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడే దేశం అంటే మట్టి కాదోయ్‌.దేశమంటే మనుషులోయ్‌ అన్న గురజాడ నానాడి బలపడగలదు. రాజ్యాంగ రచయిత అంబేడ్కర్‌ స్ఫూర్తి మరింత ఆదర్శం కాగలదు.