Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ నెల 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ

మహబూబాబాద్ బ్యూరో జూన్ 20 నిజం న్యూస్

హైదరాబాద్‌: అర్హులైన గిరిజనులకు ఈనెల 24 నుంచి 30 వరకు పోడు పట్టాలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. 1,50,012 మంది గిరిజనులకు 4,05,601 ఎకరాలు పంపిణీ చేసేందుకు జిల్లా కమిటీలు పోడు పట్టాలు సిద్ధంచేశాయి. 24న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

తొలుత ములుగు జిల్లాలో ప్రారంభించాలని భావించినా… ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ భవనం సిద్ధం కావడంతో కలెక్టరేట్‌ భవనంతో పాటు పోడు పట్టాల పంపిణీ అక్కడి నుంచి ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలిసింది.

ఈ మేరకు ఆసిఫాబాద్‌ జిల్లాలో పోడుపట్టాల కార్యక్రమ నిర్వహణ, బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ పోడుపట్టాల పంపిణీ ప్రారంభించిన తరువాత జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అర్హులైన వారికి ఈనెల 30 వరకు పట్టాలు ఇవ్వనున్నారు.

అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595 మంది లబ్ధిదారులకు 1,51,195 ఎకరాల భూమి పంపిణీ జరగనుంది. ఆ తరువాత మహబూబాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, ములుగు జిల్లాలు ఉన్నాయి. అత్యల్పంగా నారాయణపేటలో ముగ్గురు లబ్ధిదారులకు ఎనిమిది ఎకరాలు, పెద్దపల్లిలో ముగ్గురికి కలిపి ఒక ఎకరం భూమిపై పోడు హక్కులు లభించనున్నాయి.