రికార్డు గరిష్ఠాల దిశగా స్టాక్ మార్కెట్ సూచీలు
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జూన్ 19
(నిజం చెపుతాం)
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను మొదలుపెట్టడం విశేషం.
ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 148 పాయింట్ల లాభంతో 63,532 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 18,869 దగ్గర కొనసాగుతోంది. రెండు ప్రధాన సూచీలు రికార్డు గరిష్ఠాల దిశగా పయనిస్తున్నాయి.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.93 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్‌అండ్‌టీ, టైటన్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
*గతవారం నష్టాల్లో..*
గతవారాన్ని అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగించాయి. లాభాల స్వీకరణ నేపథ్యంలో నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు సైతం నష్టాల్లో పయనిస్తున్నాయి. త్వరలో జీఎస్‌టీ మండలి సమావేశం జరగనుండటంతో, రేట్ల సవరణలు ఆశిస్తున్న కొన్ని రంగాల షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. రుతుపవనాల పురోగతి ఆశాజనకంగా లేకపోవడం మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపొచ్చని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈనెల 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.3.80 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక శాఖ ఆదివారం తెలిపింది.
*మోదీ అమెరికా పర్యటన వల్లే..*
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో, ఆ దేశంతో కుదుర్చుకోనున్న కొన్ని వ్యూహాత్మక ఒప్పందాల వల్ల భారత రక్షణ, పారిశ్రామిక రంగాల కంపెనీలు లబ్ధి పొందే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా బిల్డింగ్స్ పర్మిట్స్ డేటా, అమెరికా నిరుద్యోగ క్లెయిమ్‌లు, జపాన్ తయారీ పీఎంఐ, చైనా రుణ రేటు వంటివాటి అంశాలు ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
*టాటా స్టీల్ మూలధనం..*
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాల కోసం రూ.16,000 కోట్ల ఏకీకృత మూలధన వ్యయాలకు సన్నాహాలు చేస్తున్నట్లు టాటా స్టీల్ వెల్లడించింది. పతంజలి ఫుడ్స్ రాబోయే అయిదేళ్లలో రూ.1200-1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని సంస్థ సీఈఓ సంజీవ్ ఆస్తానా వెల్లడించారు.
ఇందులో అత్యధికం పామాయిల్ వ్యాపార విస్తరణకే కేటాయిస్తామన్నారు. చత్తీస్‌గఢ్‌లోని ప్లాంటులో బ్లాస్ట్ ఫర్నేస్‌ను ఈనెలలో ప్రారంభించాకే, ప్రభుత్వం ఎన్‌ఎండీసీ స్టీల్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఎల్)ను ప్రైవేటీకరించడానికి ఆర్థిక బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల స్టాక్స్‌పై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.