Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణ ఇంచార్జిగా డి కె ?

కాంగ్రెస్ సంధించనున్న బ్రహ్మాస్త్రం

ఇక కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపధ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ తెలంగాణ పైన ఆశలు పెట్టుకుంది.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రధాన పోటీ దారు తామేనని , బి ఆర్ ఎస్ ను గద్దె దించడంతో పాటు రాష్ట్రంలో బి జె పి బలం పెరగకుండా పక్కా వ్యూహం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీలో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది.

తొలుత వివాదస్పద నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి చేత మేమంతా కలిసిపోయాం, మాలో ఎటువంటి విబేధాలు లేవని, అందరం వచ్చే ఎన్నికల కోసం కలిసికట్టుగా పని చేస్తామని చెప్పించింది. తర్వాత పార్టీలోని సీనియర్లకు సన్నిహితుడైన ప్రస్తుత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు పార్టీ ఇంఛార్జ్ గా నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రేవంత్ నాయకత్వం..విభేదిస్తున్న సీనియర్లు కర్ణాటక ఎన్నికల తరువాత డీకేకు తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు. డీకే సమర్ధత పైన నమ్మకం ఉన్న అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపుతోంది. ఇతర పార్టీల నేతల చేరితో పాటుగా సీనియర్ల సమన్వయం..ఎన్నికల వ్యూహాల బాధ్యతలను డీకేకు అప్పగించేందుకు రంగం సిద్దమైంది.

ఈ దిశగా రాబోయే రెండు రోజుల్లో కీలక ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో విజయం తరువాత కాంగ్రెస్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది.. తెలంగాణ పైన ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యత ప్రియాంక స్వీకరించారు.

ఇది కూడా చదవండి….మంచినీళ్ల పండుగ… పట్టణానికి మంచినీళ్లు ఏవి? … నిజం వార్తకు స్పందన.

ఇప్పుడు ఎన్నికల సమాయత్తంలో భాగంగా ఢిల్లీకి పార్టీ నేతలకు పిలుపువచ్చింది. ఎన్నికల రూట్ మ్యాప్ ఖారారు చేసేందుకు ముఖ్య నేతలు సమావేశం కానున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలకుండా షర్మిల పార్టీ విలీనం..పొత్తు దిశగా డీకే శివకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది.

అంతే కాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదన్న రికమెండేషన్ న్ ఉ పార్టీ అధినాయకత్వం తోసిపుచ్చింది.
కేసీఆర్ ను ఓడించేది కాంగ్రెస్సే అన్న అభిప్రాయం తీసుకు రావడానికి .. బీఆర్ఎస్ ను ఓడించడానికి రెడీ అయ్యే అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపునకు తిప్పుకునేందుకు డీకే శివకుమార్ సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం ప్రారంభమైన చేరికల వెనుక డీకే శివకుమార్ మంత్రాంగం పని చేసిందని చెబుతున్నారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటు..కాంగ్రెస్ అనుకూల ఓటు చీలకుండా కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్లాలని డీకే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

బెంగళూరు నుంచే ఆయన వ్యూహాలు అమలు చేస్తున్నారు. పార్టీలో చేరాలనుకున్న వారు బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ ను కలుస్తున్నారని చెబుతున్నారు.

ప్రత్యేక కధనం: సాయిప్రతాప్