నాన్న ఎప్పుడు ఇంతే
పండగయినా,పబ్బమయిన పరిగెడుతూనే ఉంటాడు
ఏదో ఆలోచిస్తూ ఉంటాడు
ఏదో పని చేస్తున్నే ఉంటాడు
నాన్న ఎప్పుడు ఇంతే..
నేను ఎండలో నిలబడితే గసురుకుంటాడు
తాను మాత్రం ఎండలోనే వేగుతుంటాడు
నాన్న ఎప్పుడు ఇంతే..
నా భవిష్యత్ గురించి
కలలు కంటాడు
తాను మాత్రం వర్తమన్నానే వదిలేస్తాడు
నాన్న ఎప్పుడు ఇంతే..
నావైపు కష్టం కన్నెత్తి చూడకుండా
కష్టాన్ని శాసిస్తాడు
తాను మాత్రం కష్టాన్నే శ్వాసిస్తాడు
నాన్న ఎప్పుడు ఇంతే..
నాకోసం బోల్డు కొత్త బట్టలు కొని మురుస్తాడు
తన కోసం మాత్రం కొత్తబట్టల సంగతే మరుస్తాడు
నాన్న ఎప్పుడు ఇంతే..
కళ్ళల్లో కోపాన్ని నటిస్తాడు
కనబడకుండా కొండంత
ప్రేమని దాసేస్తాడు
నాన్న ఎప్పుడు ఇంతే
వేలు పట్టి నడిపిస్తాడు
గుండెలపై జోకొడతాడు
భుజాలపై ప్రపంచాన్నే పరిచయం చేస్తాడు
నాన్న ఎప్పుడు ఇంతే..
పడిపోతుంటే పట్టుకుంటాడు
తిరగబడితే తట్టుకుంటాడు
బ్రతుకు బండి లాగుతాడు
ఒంటరిగా సాగుతాడు
నాన్న ఎప్పుడు ఇంతే..
చెమట ఆరని సూరీడు
గెలిపించే సైనికుడు
మనసున్న
మారాజు నాన్న
అవును ….
నాన్న ఎప్పుడు ఇంతే
(నిజం చెపుతాం పత్రిక తరపున ఫాదర్స్ డే శుభాకాంక్షలతో )
✍️రచన :చల్లా శ్రీనివాస్
వర్ధమాన కవి
నిజం చెపుతాం రిపోర్టర్
మోడరన్ విద్యాసంస్థలు
అకడమిక్ అడ్వైజర్,
ఆంగ్ల అధ్యాపకులు