మంచినీళ్ల పండుగ పూట…. పట్టణానికి మంచినీళ్లు ఏవి ?
నేడు మంచినీళ్ల పండుగ. పట్టణానికి ఏవి మంచినీళ్లు?.
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూన్ 18, (నిజం న్యూస్):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహిస్తున్న “మంచినీళ్ల పండుగ” రోజున మహబూబాబాద్ పట్టణానికి గత మూడు రోజుల నుండి మంచినీటి కుళాయిల్లో నీళ్లు రాక మొరాయిస్తున్నాయి.
పట్టణ జిల్లా పాలనాధికారులు మాత్రం ఆదివారం మంచినీళ్ల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. వీరి ఉత్సాహాన్ని చూసి పట్టణ ప్రజలు నీళ్లే రావడం లేదు ఇక నీటి పండుగలు ఎందుకు అని విమర్శిస్తున్నారు.
జిల్లా పాలనాధికారి ఎన్నో మార్లు సమావేశాలు నిర్వహించి సంబంధిత అధికారులకు వేసవికాలంలో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా” దున్నపోతు మీద వాన పడ్డ” చందంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
మంచినీటి సరఫరా పై సంబంధిత మున్సిపాలిటీ పై అధికారులపై ఎన్ని వార్తలు వచ్చిన ప్రజలకు మంచినీటి సమస్యను తీర్చడంలో విఫలమవుతున్నారు. గతంలో మంచినీరు రానందుకు “పది రోజుల నుండి పట్టణానికి నీళ్ల బంద్” అనే శీర్షికలో వార్తలు వచ్చినప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ స్పందించారు.
వారికి తోచిన కష్టాలను వారు చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతుంది. ఒక ప్రక్క భగభగ మండే భానుడి విశ్వరూపం.
మరో పక్క విపరీతమైన వడగాల్పులు. మరో ప్రక్క పట్టణ ప్రజలకు తాగటానికి గుక్కడి నీరు లేదు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంచినీటి పండుగ ఈ విధంగానే ఉంటుందా అని ప్రజలు విమర్శిస్తున్నారు.
లక్ష పైచిలుకు గల పట్టణ జనాభా కు కొన్ని ట్యాంకుల ద్వారా నీటిని సప్లై చేస్తే పట్టణ జనాభాకు సరిపోతుందా? ట్యాంకర్ల ద్వారా తెచ్చే నీరు స్వచ్ఛమైనదేనా? పట్టణ ప్రజలు ఈ నీటిని తాగవచ్చా? ఒకవేళ తాగితే ప్రజలకు ఎలాంటి రోగాలు వస్తాయి అని పట్టణ ప్రజలు భయపడుతున్నారు.
జిల్లాలోని మహబూబాబాద్ పట్టణ మున్సిపాలిటీకి “ద బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు “కూడా వచ్చింది కానీ పట్టణ ప్రజలకు మాత్రం మంచినీరు రావు. ఇది “ద బెస్ట్ మున్సిపాలిటీ” పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా పాలన అధికారులు ,మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, పట్టణ మంచినీటిపై దృష్టి పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.