Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వానాకాలంలో ఎండాకాలం

నైరుతి ప్రవేశించినా తగ్గని ఎండల తీవ్రత
పెరుగుతున్న కరెంట్‌ వినియోగం
కాలం కాని కాలం దాపురించింది. రుతుపవనాలు ప్రవేశించి పక్షం రోజులు దాటినా ఇంకా ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత ఆందోళనకు గురి చేస్తోంది. వేడిగాలులతో జనం విలవిలలాడుతున్నారు. సాయంత్రం వేళలో అక్కడక్కడా చిరుజల్లులు పడినా ఆ తర్వాత భరించలేని ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో కరెంట్‌ వినియోగం కూడా పెరుగుతోంది.

ఎసిలు లేనిదే పట్టణ ప్రజలు ఉండలేకపోతున్నారు. ఆంధ్రాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. అక్కడ మధ్యాహ్నం వేళలో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కొన్ని జిల్లాలో విత్తిన పత్తిగింజలు మొలకెత్తాయి. ఆ తర్వాత ఆశించిన మేర వానలు లేకపోవడంతో పత్తి మొలకలు వాడిపోతున్నాయి.

జూన్‌ రెండు లేదా మూడో వారంలో వర్షాలు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు వరుణుడు కరుణించలేదు. వర్షాకాలం ప్రవేశించినప్పటికీ ఎండకాలం తలపిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నప్పటికీ ఎండల తీవ్రత ధాటికి చేన్లు పొడిబారి పోయాయి.

ఇది కూడా చదవండి.,,మోడీ తొమ్మిదేళ్ల పాలనపై డబ్బా

వర్షం పడితే కానీ దున్ని విత్తనాలు నాటుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎండల తీవ్రతకు జనం ఉక్కపోతతో ఆగమాగం అవుతున్నారు. అప్పుడప్పుడు వాతావరణంలో మార్పు చోటుచేసుకుని చల్లబడుతున్నప్పటికీ రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటున్నాయి.

వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. పూర్తిస్థాయి వర్షాలు పడే వరకు రైతులు తొందర పడకుండా విత్తనాలు నాటొద్దని అధికారులు సూచించారు. అయినప్పటికీ కొన్నిచోట్ల రైతులు విత్తనాలు నాటుకుంటున్నారు.

ఇప్పటికీ ఆశించిన మేర వానలు పడలేదు. రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిరచారు.