Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మోడీ తొమ్మిదేళ్ల పాలనపై డబ్బా

ప్రజల్లో నివురుగప్పిన ఆందోళన !
ప్రధాని మోడీ తొమ్మిదేళ్లుగా దేశం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఊరట కలిగించేలా లేవు. అంతేగాకుండా వివాదాస్పద నిర్ణయాలతో ప్రజల్లో లేని ఆందోళన కలిగిస్తున్నారు. అలాగే నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు ఏనాడు చేయలేదు.

ప్రభుత్వరంగ సంస్థలను అనుయాయులకు తెగనమ్మడంతో ఉన్న ఉపాధి,ఉద్యోగావకాశాలు పోయాయి. అయినా కళ్లు తెరవని మోడీ తను అనుకున్న రీతిలోనే ముందుకు సాగుతున్నారు. దేశ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలపై ఏనాడూ చర్చించకుండా తొమ్మిదేళ్ల పాలనపై ప్రకటనలతో సొంత డబ్బా కొట్టుకుంటున్నారు.

కేంద్రమంత్రులు రాష్టాల్రు తిరుగుతూ మోడీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ది అంటూ ఘనత చాటుకుంటున్నారు. దీనికి ఎక్కడా ప్రజా స్పందన కానరావడం లేదు. అమిత్‌ షా లాంటి వారు వచ్చిపోతున్నా..ప్రజల్లో స్పందన కానరావడం లేదు. అయినా ప్రజల్లో ఉన్న నైరాశ్యాన్ని గుర్తించి పార్టీలో, ప్రభుత్వంలో చర్చించడం లేదు. జిఎస్టీతో భారీగా వసూళ్లు దండుకుంటున్నారు.

గ్యాస్‌, పెట్రో ధరలతో దోచుకుంటున్నాయి. అయినా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాల కల్పనలో శ్రద్ద చూపడం లేదు. సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా గతేడాది ఆందోళనలు కొనసాగాయి. అయినా పట్టించుకోలేదు.

పలు రాష్టాల్ల్రో నిరుద్యోగులు ఆందోళనలు జరుగుతున్నా..నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. ఖాళీల భర్తీకి కంటి తుడుపుగా రాబోయే పద్దెనిమిది మాసాల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీచేయబోతున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం గతేడాది ప్రకిటించినా..ఎలాంటి నియామకాలు చేశారో తెలియదు. ప్రభుత్వరంగంలో ఉన్న వివిధ ఖాళీల గురించి మోదీని విపక్షాలు అడపాదడపా ప్రశ్నిస్తున్నా పెద్దగా స్పందిలేదు.

నిరుద్యోగ సమస్యపై ఎక్కడా చర్చించడం లేదు. జాబ్‌ కాలెండర్‌ ప్రకటించాలని, ఎన్నికలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా అది ఏటా విధిగా అమలవుతూ ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీచేస్తూ పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.అందుకే నిరుద్యో సమస్యపై విపక్షాలు అదేపనిగా విమర్శలు చేస్తున్నాయి. తొమ్మిదేళ్ళ క్రితం మోడీ తన ఎన్నికల ప్రచారంలో ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇంకా యువతను,దేశప్రజలను మభ్యపెట్టడం కుదరదని బిజెపి శ్రేణులు గుర్తిస్తే మంచిది.

దేశంలో నిరుద్యోగం ఏడుశాతానికి దగ్గరగా ఉంటూ, లక్షలాదిమంది మహిళలు ఉపాధికి దూరమైపోతున్న స్థితి నేడు దేశంలో ఉంది. గత ఏడాదితో పోల్చితే నిరుద్యోగం రెట్టింపయింది. కరోనాతో ఉపాధి, ఉద్యోగ రంగాలు దెబ్బతిన్నాయి. కార్పోరేట్ల ఆదాయం మాత్రం రెట్టింపయ్యింది. రోడ్డున పడ్డ వారి కోసం ఆలోచన చేయడం లో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. ఏటా కోటిన్నరమంది శ్రమచేయగల వయసులోకి అడుగిడుతుంటే, యాభైలక్షల మంది శ్రామికులుగా మారుతున్నారు.

ఆర్థికవ్యవస్థ మొత్తంగా కార్పొరేట్లకు అనుకూలం గా మారిపోవడంతో, చట్టాలు వారి చుట్టాలుగా తయారవుతూండటంతో శ్రమకు తగిన ఫలితం దక్కని ఉద్యోగాలే ఇప్పుడు ఎక్కువైనాయి. కార్పొరేట్ల నుంచి స్టార్టప్పుల వరకూ ఒకచేత్తో ఇచ్చినట్టే ఇచ్చి, మరో చేత్తో లాక్కుంటున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయం పేదల ఉపాధిని పెద్దగా దెబ్బతీసింది. ఇది చాలదన్నట్లు ఇటీవల ఉన్న 2వేల నోట్లను రద్దు చేశారు.

ఇది కూడా చదవండి…మైనింగ్ మాఫియా ఉరుకులు 

నగదులావాదేవీలను తగ్గించడం, నల్ల డబ్బును, ఉగ్ర డబ్బును నిరోధించడం వంటి మాటలు చెప్పి తీసుకున్న ఈ నిర్ణయం అంతిమంగా ఏ ఫలితమూ ఇవ్వలేదని అనతి కాలంలోనే తేలిపోయింది. కనీసం 20లక్షల మంది ఉపాధికోల్పోయారని, అసంఘటితరంగం చావుదెబ్బ తిన్నదని ఆర్థిక నిపుణులు తేల్చేశారు. ఆ తరువాత కోట్ల ఉద్యోగాల లెక్కలు పక్కకు పోయి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ఐదేళ్ళలో 60లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. కరోనా మిగల్చిన విషాదాలు, విధ్వంసాలతో పాటు మనం చేజేతులా చేసిన పాపాలను సరిదిద్దుకోవాలంటే, ఉద్యోగ ఉపాధి కల్పనలు వాస్తవాల ప్రాతిపదికన జరగాలి.

ఒకపక్కన ఉక్రెయిన్‌ యుద్ధం, మరోపక్కన మహమ్మారి, అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు సామాన్యుడిని కుదిపేస్తు న్నాయి. రిజర్వుబ్యాంకు క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా, నిపుణుల సూచనలతో, ఎన్నికల ప్రయోజనా లతో నిమిత్తం లేకుండా ప్రణాళికా బద్ధంగా ఉద్యోగ ఉపాధి కల్పన జరిగిపోవాలి. కానీ మోడీ అధికారంలోకి వచ్చాక అలా జరగడం లేదు. ప్రచారార్భాటాలే తప్ప ఎక్కడా ప్రయోజనాలు కానరావడం లేదు.

దేశంలో పరిస్థితులను చర్చించేందుకు మోడీ ఎప్పుడూ సిద్దంగా లేరు. పార్లమెంటులో సైతం ప్రజల సమస్యలు కావచ్చు, సాగు చట్టాలు కావచ్చు చర్చించడానికి సిద్దంగా లేరని తేలిపోయింది. మోడీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మోడీ తొమ్మిదేళ్ల పాలనపై డబ్బా కొట్టుకుంటున్నారు. దేశంలో ఆహారధాన్యాలు ఉత్పత్తి పెరుగుతున్నా..రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు.

అలాగే సామాన్యులకు అందుబాటులో తిండిగింజలు దక్కడం లేదు. దీనికి లోపం ఎక్కడో గుర్తించడం లేదు. నిత్యం వాడే మందుల ధరలు విపరీతంగగా పెరిగాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీ పెరిగింది. టెస్టుల పేరుతో ప్రజల జేబులు గుల్ల చేసి వారిని నడిబజారులో పడేలా చేస్తున్నారు. ఇవేవీ ప్రభుత్వాలు తమ పరిధిలో లేవన్న చందంగా మిన్నకుంటున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను నిర్వీర్యం చేయడంతో ప్రైవేట్‌ విద్యాసంసథల దోపిడీ పెరిగింది. మోడీ అనుసరిస్తున్న విధానాలనే ఆయా రాష్టాల్ల్రో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్నాయి. ఈ విషయాలపై ప్రజలు చర్చించాలి.

దోపిడీ ప్రభుత్వాలను సాగనంపి తమకు మేలు చేసే ప్రభుత్వాలను ఎన్నుకుంటే తప్ప దేశం బాగుపడదు. ప్రజలకు ఊరట దక్కదు. ఇప్పటికే తీవ్రమైన ఒడుదుడుకులకు గురవుతున్న మన సామాజిక వ్యవస్థపై దీని పర్యవసానాలు మరింత ప్రమాదకరంగా ఉంటాయి.