ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణా కాంగ్రెస్ దూకుడు
కర్నాటకలో విజయం తర్వాత తెలంగాణా కాంగ్రెస్ నేతలలో ఆత్మవిశ్వాసం పెరిగిందనే చెప్పాలి. ఆ పార్టీ ముఖ్యనేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క రాష్ట్రమంతటా పాదయాత్రలు చేస్తూ, అధికార టిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరొకపక్క వివిధ పార్టీలలో అసంతృప్తులను ఆకట్టుకునేందుకు, తద్వారా పార్టీని బలపరచడంతో పాటు ఎదుటి పక్షాలను బలహీనపరచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌లో కొందరు ముఖ్య బీఆర్‌ఎస్ మాజీ నేతల చేరికపై క్లారిటీ వచ్చింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఈ నెలాఖరులో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది.
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ భారత్‌కు తిరిగి వచ్చాక ముగ్గురు నేతలు ఆయనతో స్వయంగా భేటీ కానున్నారు. జూన్ నెలాఖరున ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. నాగర్‌కర్నూలులో జరిగే సభలో జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీలో చేరనున్నారు.
ఈ సమావేశంలో టీజేఎస్ చీఫ్ కోదండరాం పాల్గొన్నారు. కాగా పలువురు కీలక నేతలు హస్తం పార్టీ నేతలకు టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకుల చేరికలన్నీ నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ కన్నుసన్నల్లో జరుగుతున్నాయి.
ఇప్పటికే కొందరు నాయకులు హస్తం పార్టీలో చేరేందుకు సుముఖత తెలుపగా.. మరికొందరు నేతలు సైతం అదేబాటలో ఉన్నట్లు తెలుస్తోంది..
తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి ఇంటికి గురువారం ఆయన వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. కొడంగల్ సీటును గుర్నాథ్‌రెడ్డికి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో గుర్నాథ్‌రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
తెలంగాణలో అధికారం సాధించాలంటే రాష్ట్ర, నియోజకవర్గ స్థాయుల్లో ప్రభావం చూపగల ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్పనిసరి అని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని పరిమితం చేసి.. బలంగా ఉన్న అధికార బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే.. నియోజకవర్గాల స్థాయిలో పార్టీలో చేరికలను ముమ్మరం చేయాలని చూస్తోంది. బీఆర్‌ఎస్, బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులతోనూ కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది.
ఈ దఫా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు కష్టమేనన్న బీఆర్‌ఎస్ హైకమాండ్ సంకేతాలతో.. పలువురు నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.దీనిని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.
తెలంగాణలో ఎన్నికల కోసం కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న సునిల్ కనుగోలు టీమ్ ఇతర స్వతంత్ర ఏజెన్సీల ద్వారా పార్టీ రాష్ట్రంలో పలు సర్వేలు చేయిస్తోంది.
అది పూర్తయిన తర్వాత 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో119 నియోజకవర్గాలు ఉండగా.. అందులో 50 శాతం సీట్లకు అభ్యర్థులను జూన్‌లోనే ఖరారు చేస్తారని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు.