బండి సంజయ్ ను మార్చేది లేదు
తెలంగాణ బీజేపీ అధ్యక్ష చీఫ్ పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించి మరొకరిని నియమిస్తారనే ఉహాగానాలు గత కొద్ది రోజులుగా మీడియాలో జోరుగా వినిపిస్తున్న నేపధ్యంలో ఈ రోజు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఒక స్పష్తత ఇచ్చారు. బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఈ విషయంలో జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలే అని తరుణ్ చుగ్ వెల్లడించారు. బండిసంజయ్ వ్యతిరేకులు విపక్ష ముఖ్యనేతలు అందరూ కలిసి ఆడుతున్న మైండ్ గేం ఈ అసత్యపు ప్రచారం అని ఆయన అన్నారు. అయితే పార్టీలో పలువురు నేతలకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తామని తరుణ్ చుగ్ తెలిపారు.
తెలంగాణలో కొంతకాలంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తారని.. ఆయన స్థానంలో కొత్తగా ఈటల రాజేందర్ లేదా డీకే అరుణను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని ఊహాగానాలు జోరుగా వినిపించదంతో పాటు ఈటల రాజేందర్ పలువురు బీజేపీ నేతలను కలవడం, ఢిల్లీ పర్యటనలు కూడా చేయడం కూడా ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది.
ఎన్నికలు మరి కొద్ది నెలలలో జరిగే ఈ కీలక సమయంలో ఇటువంటి అసత్యపు ప్రచారాలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీస్తాయని కనుక ఈ విషయంలో జాతీయ నాయకత్వం తక్షణం ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నేతలు సమిష్టిగా కేంద్ర సంచాలకులకు విజ్ఞప్తి చేసారు.
Also read: ఐటి అధికారుల సోదాలు.. నేతల్లో టెన్షన్
రాష్ట్ర నాయకత్వం సమష్టిగానే పనిచేస్తుందని తరుణ్ చుక్ ఈ రోజు స్పష్తంగా చెప్పారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. తెలంగాణా బీజేపీ నాయకులు అందరూ ఒకే తాటిపై ఉన్నారని, తామంతా కలిసికట్టుగానే ఉన్నామని, రాష్ట్ర పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని పేర్కొన్నారు తరుణ్ చుగ్.
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బి జె పి పని చేస్తుందని, కేంద్ర నాయకుల పర్యటనలు త్వరలోనే ప్రారంభం అవుతాయని, మిషన్ 99 పధకం ఇప్పటికే ప్రారంభించామని ఆయన పేర్కొనడం విశేషం.
సాయిప్రతాప్