Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కబ్జా కోరల్లో భూదాన్‌ భూములు

మంచిర్యాల జిల్లా ప్రతినిది జూన్ 14 (నిజం చెపుతాం) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భూదాన్‌ భూముల కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉంది. దశాబ్దాల కాలంగా భూదాన్‌ భూముల్లో అధిక భాగం కబ్జాలకు గురికాగా గతంలో స్థానికుల ఆందోళనలతో అధికారులు వాటిని రక్షించే ప్రయత్నం చేశారు.

భూములను ప్రభుత్వ స్థలాలుగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు బోర్డ్‌ ఏర్పాటు చేశారు. గోదావరిరోడ్డులో ఏకలవ్య ఆశ్రమం సమీపంలో ఉన్న ఈ భూముల విలువ ఎకరాకు రూ.4 కోట్లపైనే ధర పలుకుతోంది.

దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను వీటిపై పడింది. భూదాన్‌ భూములు కావడం, ట్రస్ట్‌ బోర్డుకు సంబంధించి స్థానిక సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వాటిని చేజిక్కుంచుకొనేందుకు కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా దశాబ్దాల కాలంనాటి భూముల వివరాలను వెలికి తీయడం, వాటిని రెవెన్యూ అధికారుల అండదండలతో వారి అనునాయుల పేర్ల మీదకు మార్చడం చకచకా జరిగిపోయాయి.

స్థలాల కేటాయింపులో బోర్డు సభ్యుల ఇష్టారాజ్యం

భూదాన్‌ భూమికి చెందిన స్థలాలను పేద వారికి కేటాయించాల్సి ఉండగా స్థానిక బోర్డు సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1951లో ఏర్పాటైన ఆచార్య వినోభాభావే భూదానోద్యమంలో భాగంగా భూస్వాముల మిగులు భూములను దానం తీసుకోగా భూమిలేని వారికి పంచాలనే నిబంధన ఉంది.

అయితే స్థానిక సభ్యులు ఉన్నత వర్గాలతోపాటు తన అనునాయులకు అక్రమంగా భూములు కేటాయించారనే ఆరోపణలున్నాయి. సభ్యుల పదవీకాలం ముగియనుండటంతో గతంలో తన అనునాయులైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ధారాదత్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీని వెనుక కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల హస్తం ఉన్నట్లు సమాచారం.

పదెకరాల సంగతేంది?

మంచిర్యాల శివారులోని సర్వే నెంబర్లు 65, 708లలోని 38.27 ఎకరాల భూదాన్‌ భూముల్లో 28.27 ఎకరాలు ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉండగా మరో పదెకరాలకు సంబంధించి దశాబ్దాలుగా లెక్క తేలడం లేదు. సదరు పదెకరాలను భూదాన యజ్ఞ బోర్డు 1994లో స్థానిక నివాసి అయిన కుసుంతాయి దండేకర్‌కు 5 ఎకరాలు, ఆమె కుమారుడు సత్యకాం దండేకర్‌కు 5 ఎకరాలు కే టాయించింది. అయితే సత్యకాం దండేకర్‌ హత్యకు గురికావడంతో 2004లో భూదాన్‌ యజ్ఞ బోర్డు అతని తల్లి కుసుం సాయి దండేకర్‌ పేరిట పదెకరాలను కేటాయిస్తూ నం.18256 ప్రకారం పేరు మార్పిడి చేస్తూ ప్రొసీడింగ్‌ ఇచ్చింది.

అయితే భూదాన్‌ బోర్డులో లబ్ధిపొందిన వారు 1965 భూదాన, గ్రామదాన చట్టం ప్రకారం అమ్మకాలు చేపట్టరాదు. అందులో వ్యవసాయం, చేపల పెంపకం, పాల ఉత్పత్తులు, కోళ్ల పెంపకం తదితర వాటికోసం మాత్రమే ఉపయోగించాలనే నిబంధన ఉంది. అయితే సదరు పదెకరాలను బోర్డు నిబంధనకు వ్యతిరేకంగా పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు విక్రయించారు.

ఇది కూడా చదవండి…..అక్టోబర్ 1 నాటికి 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు

దీనిని నిరసిస్తూ 2006లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌కు స్థానికులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో నిర్మాణాలను అడ్డుకున్నారు. దీంతో భూమిని కొనుగోలు చేసిన వారు హైకోర్టును ఆశ్రయించారు. పౌర సేవా స్వచ్ఛంద సంస్థ కన్వీనర్‌ తులా మఽధుసూదన్‌రావు సాక్ష్యాధారాలతో కోర్టుకు హాజరు కాగా పరిశీలించిన హైకోర్టు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని 2017లో సంబంధిత శాఖను ఆదేశించినప్పటికీ నేటికీ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలున్నాయి.

రోడ్డు కోసం బోర్డు తొలగింపు

ఇదిలా ఉండగా భూదాన్‌ భూములను ఆనుకొని ఉన్న పట్టా భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్‌ ఏర్పాటు చేశారు. వెంచర్‌లోకి వెళ్లేందుకు అనువైన దారి లేనందున గోదావరి రోడ్డు నుంచి భూదాన్‌ భూముల మీదుగా 2017లో రోడ్డు నిర్మాణం చేపట్టి విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని వరుస కథనాలతో వెలుగులోకి తేవడంతో స్పందించిన అధికారులు దారికి అడ్డంగా ఫెన్సింగ్‌తోపాటు అది ప్రభుత్వ స్థలమని, కబ్జాదారులు శిక్షార్హులని బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఇంతకాలం స్తబ్దంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కళ్లు మళ్లీ భూదాన్‌ భూములపై పడ్డాయి.

ఐదారు రోజుల క్రితం అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను, బోర్డును తొలగించారు. వెంచర్‌లోకి వెళ్లేందుకు భూదాన్‌ భూముల్లో గతంలో ఏర్పాటు చేసిన రోడ్డును వినియోగిస్తున్నారు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసే జరుగుతోందనే అభిప్రాయాలున్నాయి. త్వరలో భూదాన్‌ భూముల్లో 60 ఫీట్ల రోడ్డును నిర్మించి, దాన్నే ప్లాట్ల కొనుగోలుదారులకు తమ రోడ్డుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయమై స్థానికులు అదనపు కలెక్టర్‌, తహసీల్దార్‌లకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భూదాన్‌ భూములకు రక్షణ కల్పిస్తారో లేదో చూడాలి.

అధికారుల అలసత్వంతోనే

తులా మధుసూధన్‌ రావు

అధికారుల అలసత్వం మూలంగానే భూదాన్‌ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. భూములను కాపాడేందుకు ఎప్పటికప్పుడు ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కోట్లు విలువ చేసే భూములు ఖాళీగా ఉన్నాయి. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అధికారులు కాసులకు కక్కుర్తిపడి మూసిన రోడ్డును తెరిపించారు. కలెక్టర్‌ స్పందించి, భూదాన బోర్డు భూములు ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.