ఏజెన్సీల్లో ఎల్ఆర్ఎస్ వద్దు ఐటీడీఏ ముట్టడించిన ఆదివాసీలు

సర్కారు తెచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయవద్దంటూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీలు మంగళవారం ఐటీడీఏ ను ముట్టడించారు. అంతకుముందు తాళ్ల గడ్డ వై జంక్షన్ నుండి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎల్ఆర్ ఎస్ ను నిలిపివేయాలని. అటవీ హక్కులు,పీసా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త రెవెన్యూ చట్టం తో ప్రభుత్వం ఏజెన్సీలోని ఎల్ టి ఆర్ చట్టానికి తూట్లు పొడిచేందుకు దిగిందని ఆరోపించారు. హరితహారం పేరిట ఆదివాసీలా భూములను లాక్కోవడం మానుకోవాలని కోరారు. జివో నెంబర్. 3ని పార్లమెంటులో చట్టం చేసి ఆదివాసీలకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో సాదాబైనామా జీవో నెంబర్. 58 ,59 ను రద్దు చేయాలని అదే విధంగా పోడు భూములకు ఆదివాసులకి పట్టాలు ఇవ్వాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ పీవో హనుమంతు కె జండగే కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కాక నరసింహారావు, జిల్లా అధ్యక్షులు కోరినబెల్లి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగ గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు పర్షిక సతీష్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు,ఏటూరునాగారం మండల అధ్యక్షుడు తాటి రామచందర్, వెంకటాపురం మండల అధ్యక్షుడు సర్వేశ్వరరావు, వాజేడు మండల అధ్యక్షుడు టింగు బుచ్చయ్య,వేణుగోపాల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.