ఏపీలో నవంబర్‌ 2నుంచి పాఠశాలలు ప్రారంభం కార్యాచరణ రూపొందించాల్సిందిగా అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు

సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నవంబర్‌ 2వ తేదీ నుంచి పాఠశాలను పునఃప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై సీఎం స్పందించారు. నవంబరు 2 నుంచి పాఠశాలల్లో రోజువిడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేశారు. 1, 3, 5, 7వ తరగతుల విద్యార్థులకు ఒక రోజు.. 2, 4, 6, 8వ తరగతుల విద్యార్థులకు మరో రోజు తరగతులు నిర్వహించాల్సిందిగా సీఎం ఆదేశించారు. పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరించినట్లయితే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని.. 750కి తక్కువగా ఉన్నట్లయితే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం విధిగా అమలు చేయాలని ఆదేశించారు. నవంబరు మొత్తం ఒకపూటే తరగతులు నిర్వహిస్తామని.. పాఠశాల వేళలపై పరిస్థితి మేరకు డిసెంబరులో మరోసారి నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు.