Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బిజెపిని వదిలి కాంగ్రెస్‌ వ్యతిరేక పల్లవి అందుకున్న కేసిఆర్

ప్రాంతీయ పార్టీల్లో… అవినీతి బలహీనత !
మోడీ నియంతృత్వ పాలన అంటూ విమర్శలు చేస్తున్న నేతలు ఎవరు కూడా మోడీ ముందు నిలబడి గట్టిగా నిలదీయలేకపోతున్నారు. సమస్యలపై పోరాడలేకపోతున్నారు. ఉమ్మడిగా పోరాడాలన్న సంకల్పం ఎలాగూ లేదు..కనీసం ఉమ్మడి కార్యాచరణకు కూడా విపక్షాలు కలసి రాలేకపోతున్నాయి.

ప్రాంతీయ పార్టీల నేతలు తమ రాష్టాల్ల్రో అనేక అవినీతి, అక్రమాల్లో కూరుకుని పోయారు. పాలన చేపట్టిన ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల అధినేతలు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఇదే అదనుగా మోడీ ద్వయం ఈ పార్టీల ను చెడుగుడు ఆడేస్తుస్తున్నాయి. ఈ కారణంగానే ప్రాంతీయ పార్టీల నేతలు కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేక పోతున్నారు.

కేవలం వారున్నచోటనే కూర్చుని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో కెసిఆర్‌ విమర్శలు లేదా ఆరోపణలు తెలంగాణ దాటి రాలేకపోతున్నాయి. కేవలం తెలంగాణను ఆనుకుని ఉన్న మహారాష్ట్రలో కొద్దోగొప్పో పార్టీ సమావేశాలు పెట్టినప్పుడు మాత్రమే విమర్శలు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

ఇక ఎపిలో జగన్‌, చంద్రబాబు, జనసేనలు వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బిజెపి పొందుకోసం వెంపర్లాడు తున్నాయి. ప్రజాక్షేత్రంలో బలంగా కనిపిస్తున్నట్లుగా ఉంటున్న అనేక పార్టీల అధినేతలు ఇప్పుడు తమ ఏలుబడిలో ఉన్న రాష్టాల్ల్రో అధికారం నిలుపుకోవడమెలా అన్న వ్యూహాల్లో మునిగి ఉన్నారు.

ఇది కూడా చదవండి….వైద్య రంగానికి బడ్జెట్లో 12,300 కోట్లు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్

తెలుగు రాష్టాల్ర విషయానికొస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఒకప్పుడు ప్రతిపక్ష రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న తెలుగునాట ఇప్పుడు ఆ పరిస్థితి కానారావడం లేదు. ఎన్డీఎలో చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎపిలో అధికారం కోసం నానా అగచాట్లు పడుతూ అధికార వైసిపిని గద్దె దించే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. ఇందుకోసం జనసేన, బిజెపిల అండకోసం ప్రయత్నిస్తున్నారు.

ఒకప్పుడు జాతీయ పార్టీలకు సవాలుగా నిలిచిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ అస్తిత్వం కాపాడు కునే ప్రయత్నంలో ఉన్నాయి. నాయకులలో అధికార కాంక్ష పెరిగిపోవడం కారణంగా సొంత రాష్ట్రం వదిలి రావడం లేదు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టిన తరవాత ప్రతిపక్ష రాజకీయాలకు ఉమ్మడి ఎపి కేంద్ర బిందువుగా ఉండేది. ఆనాటి కాంగ్రెస్‌ పార్టీ నియంతృత్వ విధానాలపై అలుపెరగని పోరాటం చేసింది.

ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. అదే చంద్రబాబు ఇప్పుడు ఢల్లీి గడప దొక్కడానికి కూడా అవకాశం లేకుండా చేసుకున్నారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని ప్రారంభించిన కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటించినా.. ఆయన తెలంగాన దాటి రాజకీయాలు చేయలేక పోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహన్‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నా..జాతీయ రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి చూపడం లేదు. మరోమారు అధికారం నిలుపుకునే క్రమంలో ఆయన బిజీగా ఉన్నారు. అలాగే తనకున్న బలహీనతల కారణంగా బిజెపిని ఎదరించే సాహసం చేయడం లేదు.

మరో ప్రాంతీయ పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా… మళ్లీ అధికారం దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ ముగ్గురు నాయకులూ తమకున్న పరిధి రీత్యా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎదిరించలేని పరిస్థితిలో ఉన్నారు. నైతికంగా బలహీనపడటం వల్లనే కేంద్ర అధికారానికి దాసోహం అనాల్సిన పరిస్థితి ఏర్పడిరది.

నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంపై కాలు దువ్విన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ , కవిత లిక్కర్‌ స్కామ్‌ తరవాత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. దీనికితోడు కర్నాటక ఫలితాలు కూడా ఆయనను భయపెడు తున్నాయా అన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే దశాబ్ది ఉత్సవాల్లో కెసిఆర్‌ ఇప్పుడు రూటు మార్చి కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారు.

దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీనిగద్దె దించాల్సిందేనని గర్జించిన కేసీఆర్‌, చంద్రబాబులు మోడీకి దాసోహం అన్నట్లుగా మారిపోయారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేస్తానంటూ వివిధ రాష్టాల్రలో పర్యటించి, హడావిడి చేసిన కెసిఆర్‌ ఇప్పుడు మునుపటి దూకుడు ప్రదర్శించడం లేదు.

కేసీఆర్‌ రూటు మార్చగానే ఇప్పుడు బిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా బిజెపిని వదిలి కాంగ్రెస్‌ వ్యతిరేక పల్లవిని అందుకున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు పదను పెడుతున్నారు. మొన్నటి పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కూడా చేతులు కలిపి నిరసన వ్యక్తంచేసిన బిఆర్‌ఎస్‌ ఇప్పుడు అదే కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగడం యాదృచ్ఛికం కాదు. దీనివెనక బలమైన కారణాలు ఉండివుంటాయి.

ఢల్లీి లిక్కర్‌ కుంభకోణంలో కవిత పీకల్లోతు ఇరుక్కున్నాక..కెసిఆర్‌ వైఖరిలో మార్పు వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అంటూ బయలుదేరినా.. పలువురు నేతలను కలుసుకున్నా… ఆయా పార్టీల నాయకులు పెద్దగా స్పందించలేదు. ఆ తరవాత కూడా పెద్దగా రాయబేరాలు నడపలేదు. అందుకే కేసీఆర్‌ బిఆర్‌ఎస్‌ ప్రకటించినప్పటికీ దాని ప్రభావం ప్రతిపక్షాల ఐక్యతపై కనిపించడం లేదు. మొత్తంగా తెలుగు రాష్టాల్ల్రో బిజెపిని ఎదురించడానికి సాహసించే నాయకులు కానరావడం లేదు.

చంద్రబాబు అయితే కేవలం ఇప్పుడు ఎపికి పరిమితం అయ్యారు. ఒక్కసారి గత ఎన్నికల్లోదెబ్బ తిని అధికారం కోల్పోవడంతో ఆయన ఇక మోడీ జోలికి వెళ్లరాదన్న రీతిలో గుంభనంగా ఉంటున్నారు. ఎపిలో బిజెపితో పొత్తుకు వెంపర్లాడుతున్నారు.

ఇక మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌, కుమారస్వామి, అఖిలేశ్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌లు సైతం మోడీని ఎదిరించలేక చతికిల పడ్డారు. ప్రజల్లో ఊపు తెద్దామన్న ధీమాతో కూడా వీరు కలసికట్టుగా సాగలేక పోతున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు అవినీతిలో కూరుకు పోవడమే దీనికి కారణం.

వీరంతా కలిసినా ప్రత్యమ్నాయం సృష్టించలేరని ప్రజలకు కూడా తెలుస్తోంది. అందుకే మోడీకి ప్రత్యామ్నాయ నేత లేన్న భావనలో ప్రజలు కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో కూడా కుటుంబ రాజకీయాలు చర్చకు వస్తున్నాయి. అధ్యక్షుడిగా ఉన్న మల్లి కార్జున ఖర్గే నామమాత్రంగా ఉన్నారు.

ఈ క్రమంలో బిజెపికి రొమ్మువిరిచి నిలబడే నేత అవసరం. అప్పుడే జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం రాగలదు. అంతవరకు వేచిచూడాల్సిందే.