Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పరిశ్రమలలో ప్రమాదాలు…. కార్మికుల ఘోష

ఘోరం….అమానుషం….
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ 13 జూన్ (నిజం న్యూస్)
మానవత్వం ….నువ్వెక్కడ…. అనే పదాలకు అందలేని వాక్యాలు వ్రాసిన అగ్ని ప్రమాదంలో చికిత్స పొందుతూ చనిపోయిన ఆ ముగ్గురి ఆత్మలు శాంతించవు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ పఠాన్ చెరు…ఒక మినీ ఇండియా గా పేరు గాంచి వలస కార్మికులకు జీవితానికి ఆసరా… అనుకుంటే పప్పులో కాలేసినట్టే…

ఈ ప్రాంత పరిశ్రమలో పని చేసే ప్రతి కార్మికుడు తన భార్య పిల్లల్ని వదిలి ఇంటి నుండి బయలు దేరి తిరిగి ఇంటికి వెళతాడు అనే నమ్మకం చాలా తక్కువ. ఇక్కడ జరిగే ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఒక ఎత్తైతే ఆ ప్రమాదాలకు చికిత్స అందలేక లోకాన్ని విడిచి వెళ్లే దారులు ఎక్కువ..

(నిన్న పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో అందుబాటులో లేని అంబులెన్స్ లు.. చివరకు. ఆటో ట్రాలీ లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన దృశ్యాలు…
ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.)

పారిశ్రామిక వాడలో భద్రత డొల్లతనం బయట పడుతుంది….

కాల్ చేస్తే కుయ్ కుయ్ అంటూ ఘటన స్థలానికి చేరుకుని ప్రాణాలు రక్షించే అంబులెన్స్ వాహనాల జాడ లేక చివరికి ఆటో ట్రాలిలో పశువులను తరలించే విధంగా కాలిన గాయాలతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించిన దుస్థితి పఠాన్ చెరు, పాశ మైలారం, బొల్లారం పారిశ్రామిక వాడలో ఉండటం ఈ మన బంగారు తెలంగాణలో కండ్ల కు కనిపిస్తున్నది.

మీ భద్రతకు మేం ఉన్నామని ప్రగల్బాలు పలికే సామాజిక, అధికార వ్యవస్థ ఇలాంటి ఘటనలు జరిగితే కళ్ళు, నోరు మూసుకొని తన పని తాను చేసుకుంటున్నాయి.

కార్మికుడు చచ్చిన తర్వాత వారి కుటుంబానికి లక్షల రూపాయల సహాయం అందించాం అని కుటుంబ సభ్యులతో ఫోటోలకు పోజులిచ్చే వారు ఒక్కసారి ఆలోచించండి.

ఇది కూడా చదవండి…ఆస్టేల్రియా పై బాజ్‌బాల్‌ తరహా గేమ్‌ ఆడతాం…బెన్ స్టోక్స్

పరిశ్రమలు నిర్మించు కునేందుకు రోజుల వ్యవధిలోనే పర్మిషన్లు. కానీ కార్మికుల భద్రత పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా పాలకులు వ్యవహరిస్తున్నారు. పరిశ్రమల నుండి కార్మికుని చెమటతో సంపాదించిన డబ్బు లో ప్రభుత్వానికి వచ్చే వాటా సిఎస్ఆర్ ఫండ్ ను పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కొరకు కోట్ల రూపాయలు తీసుకొని ఎదో అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకోవడం కాదు… కార్మికుని ప్రాణాలకు ఎంతవరకు రక్షణ కల్గిస్తున్నామని ఆలోచించండి.

వందల కోట్ల రూపాయలు వెచ్చించి పరిశ్రమల నిర్మాణం చేసి వేల కోట్లు వెనకేసుకునే పారిశ్రామిక వేత్తలు కోట్ల రూపాయల సంపాదనకు తమ ప్రాణాలను అడ్డుపెట్టి సంపాదించి పెట్టె కార్మికుల భద్రత పై మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అంబులెన్స్ లు తమ పరిశ్రమలో ఏర్పాటు చేయలేని దుర్మార్గులు ఈ పారిశ్రామిక వాడల్లో ఉన్నారంటే సిగ్గు పడాల్సిందే.

కార్మికుల కు న్యాయం చేస్తాం…. అంటూ రంగు రంగుల చొక్కాలు వేసుకొని పరిశ్రమ ముందు జెండాలు ఎగరవేసే నాయకుల్లారా … తమ సంఘము ఉనికి కాపాడు కోవడం కోసం కార్మికులను ఏకం చేయడం కాదు. వారి భద్రత కోసం కార్మిక సిద్ధాంతాలకు కట్టుబడి నాయకత్వాన్ని బలపర్చుకోండి.

భవిష్యత్తులో తమ కుటుంబ సభ్యులే ప్రమాదానికి గురైతే ఎలాంటి రవాణా సౌకర్యం లేకుంటే మీ మనస్సు ఎంత క్షోభిస్తుందో ఆలోచించండి. ప్రతి పరిశ్రమలో గేట్ ముందు ఫస్ట్ ఎయిడ్ తో పాటు, అంబులెన్స్ ఉంటేనే పర్మిషన్ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ……

అబ్దుల్ బాసిత్,
సీనియర్ జర్నలిస్ట్,
పటాన్ చేరు.