కరోనా సోకిన గర్భిణీ స్త్రీకి చికిత్స
మేడ్వాయి కాలనీ, జానంపేట గ్రామం, పినపాక మండలానికి 22 సంవత్సరాల మహిళ ఈ నెల 19వ తేదీ రాత్రి 11.45 గంటలకు పురిటి నొప్పులతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిందని, వైద్యులు నిర్వహించిన ఆరోగ్య పరీక్షలలో ఆమెకు కరోనా వ్యాధి సోకినట్లు నిర్దారణ కాగా వైద్యులు ఎంతో సాహసంతో
ఆ మహిళకు ఆపరేషన్ నిర్వహించి తల్లి బిడ్డను కాపాడటం పట్ల జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి డా సరళ నేతృత్వంలోని వైద్య బృందాన్ని అభినందించారు.
డా సరళ ద్వారా సమాచారం తెలుసుకున్న తదుపరి కలెక్టర్ మాట్లాడుతూ ప్రసవ వేదన పడుతూ ఆస్పత్రిలో చేరిన మహిళకు కరోనా నిర్దారణ జరగడం, వైద్యులు కరోనా
ప్రోటోకాల్స్ పాటిస్తూ శస్త్ర చికిత్స నిర్వహించి తల్లి బిడ్డను కాపాడడం పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు ఎంత విలువైన వైద్య సేవలు అందిస్తున్నారో నిరూపించారని చెప్పారు. ప్రాణ ప్రాయ స్థితిలో ఉన్న మహిళకు తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి కూడా వైద్యసేవలు చేయడం చాలా హర్షణీయమన్నారు. ప్రభుత్వం లక్ష్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన సేవలు అందించాలనే తపనేనని ఆ తపనను వైద్యులు నిరూపించి మన జిల్లాకు మంచి పేరు తెచ్చారని తెలిపారు.