Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉద్యోగులకు లేని పెన్షన్‌ రాజకీయ నేతలకు ఎందుకు?

రాజకీయ నాయకులు తమ చేతిలో పనిగనక..చట్ట సభల్లో జీతాలు, భత్యాలు పెంచుకోవడం..పెన్షన్లు పెంచుకోవడం చేస్తున్నారు. తమకు ఎదురు లేదన్నట్లుగా విపరీతంగా ఖజానా సొమ్ములను నొక్కేస్తున్నారు. ప్రజలు చెమటోడ్చి చెల్లించిన పన్నులను తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ఊరేగుతున్నారు.

ఎందుకిలా అని అడిగేవారు లేరు. నిలదీసేవారు లేరు. నిలదీసే వాటికి సమాధానం రాదు. సమాధానం చెప్పరు. ఈ విషయాన్ని రానున్న ఎన్నికల్లో ఓ నినాదంగా చేయాలి. రాజకీయ నేతలను నిలదీయాలి. మన డబ్బులతో వారికి ఎందుకు పెనషన్లు అని అడగాలి.

కాయకష్టం చేస్తున్న కష్టజీవులకు కానీ, అన్నార్తులకు కానీ శాశ్వత ఉద్యోగ ఉపాధి చూపే అవకాశం ఎలాగూ లేదు. కార్మికులు కండలు కరిగించి…చేతకాని వయసులు బతుకీడ్చలేక పోతున్నారు. వారికి కార్మిక శాఖ ద్వారా గౌరవప్రదంగా వేతనం లేదా పెనషన్‌ అందించే బృహత్తర కార్యక్రమం ఏదీ మనదేశంలో అమల్లో లేదు. కానీ రాజకీయ నేతలకు పెన్షన్లు, ఉచిత రైలు, విమాన ప్రయాణాలు కల్పిస్తున్నారు.

దేశంలో వాజ్‌పేయ్‌ హయాంలో తొలగించిన ఉద్యోగుల పెన్షన్‌ వల్ల కోట్లాదిమంది పదవీవిరమణ అనంతరం నానా యాతన పడుతున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ సిపిఎస్‌ అమలు చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ బాధ్యత అంటూ ఏదీ లేదు. వారిని ఎలా గట్టెక్కించాలన్న దానిపై చర్చించరు.

ఎపిలో ఇప్పుడు ప్రభుత్వం సిపిఎస్‌ స్థానంలో తీసుకుని వచ్చిన గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ ఏ మేరకు లాభమో చర్చలు జరగాల్సి ఉంది. ఎందుకంటే దీనిపై అంతగా సానుకూలత వ్యక్తం కాలేదు. జిపిఎస్‌ అమలు చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అలాగే 2014 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరించాలని నిర్ణయించడంతో ఇప్పుడు పని చేస్తున్న వేలాదిమంది కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లు గడిచాక ఇలా ప్రకటించడం జగన్‌ విశ్వసనీయతను దెబ్బతీసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలోనూ అదే పరిస్థితి.

మాట తప్పం.. మడమ తిప్పం.. అన్న ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ఉద్యోగుల్లో నమ్మకం పోయింది. ఎన్నికల హావిూల మేరకు ఒపిఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని వర్తింపజేస్తేనే ఈ సర్కారు మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది.

ఇది కూడా చదవండి….ఎంబీబీఎస్‌కు తొమ్మిదేళ్లే చాన్స్‌

’పెన్షన్‌ భిక్షగా కాకుండా ఉద్యోగి హక్కు అన్న విషయం మరువరాదు. ఎందుకంటే పెనషన్‌ పొందుతున్న రాజకీయనాయకులు ఎలాంటి ఉద్యోగాలు చేయలేదు. వారు ఎలాంటి పరీక్షలు పాసయి రాలేదు. అలాంటి వారికి పెన్షన్‌ ఉండగా… ఉద్యోగులకు లేకపోవడం అన్నది కేవలం రాజకీయ కక్షపూరిత నిర్ణయంగా చూడాలి. అయితే ఉద్యోగ విరమణ చేసేనాటికి పొందే మూలవేతనంలో 50 శాతం మొత్తాన్ని ఉద్యోగికి పెన్షన్‌గా చెల్లించేలా జిపిఎస్‌ను రూపొందించామనీ, ఇది దేశానికే ఆదర్శం అవుతుందని ప్రభుత్వ పెద్దలంటున్నారు.

సిపిఎస్‌ లో మాదిరిగానే జిపిఎస్‌లో కూడా ఉద్యోగి జీతం నుండి పది శాతాన్ని రికవర్‌ చేస్తామంటున్నారు. ఉద్యోగి రిటైర్‌మెంట్‌ నాటికి పొందే మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌, దానిపై డియర్‌నెస్‌ రిలీఫ్‌ ఇస్తామన్న ప్రతిపాదన గతం కంటే కొంత మెరుగనిపిస్తుంది. కాని, జిపిఎస్‌ ఉద్యోగికి పూర్తి స్థాయి భద్రతను ఇవ్వదు. దానికి చట్టబద్ధత ఏమిటి? పిఎఫ్‌ఆర్‌డిఎ చట్ట పరిధిలోనే కొనసాగుతూ ఉద్యోగి ఇలాంటి గ్యారెంటీలను పొందే అవకాశం ఉంటుందా?
కేంద్ర చట్టానికి, రాష్ట్ర చట్టానికి మధ్య ఏ అంశంలోనైనా వైరుధ్యం తలెత్తితే అమలయ్యేది కేంద్రం మాటే కదా! కేంద్రం మున్ముందు పెట్టే షరతులను తు.చ. తప్పక అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందా అన్నదే అనుమానం.

రాష్ట్రంలో 2014 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడం వల్ల సుమారు 10వేల మంది లబ్ది పొందుతారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ ఆ కటాఫ్‌ తేదీ మూలంగా దాదాపు దాదాపు ఎనిమిది వేల మంది నష్టపోతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.

రెండు వేల మంది కాంట్రాక్టు లెక్చరర్లు, సుమారు 800 మంది సిఆర్‌టిలు రెగ్యులర్‌ కాని పరిస్థితి ఏర్పడుతోంది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వ్యధ వర్ణనాతీతం. వివిధ యూనివర్సిటీలు, ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్న టైమ్‌స్కేల్‌, ఫుల్‌టైమ్‌, కంటింజెంట్‌, డైలీ వేజ్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, ఐదేళ్లు కాంట్రాక్టు సర్వీస్‌ పూర్తి చేసుకున్న వెంటనే ఉద్యోగి రెగ్యులర్‌ అయ్యేలా చర్యలు చేపట్టాలని, రెగ్యులరైజేషన్‌ లోగా రిటైర్‌ అవుతున్న ఉద్యోగులకు పెన్షన్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలన్న ఆయా సంఘాల నేతలు చేస్తున్న డిమాండ్లు న్యాయ సమ్మతమైనవి.

ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడం దాని బాధ్యత. ఇచ్చిన హావిూల మేరకు సిపిఎస్‌ను పునరుద్దరించడమే మంచిది. ఎందుకంటే ఉద్యోగులకు లేని పెన్షన్‌ విధానం రాజకీయ నాయకుల కు కూడా ఉండాల్సిన అసవరం లేదు. దీనిపై ప్రజలు పోరాడాలి. ముక్తకంఠంతో ఎలుగెత్తి నినదించాలి. రాజకీయ నాయకుల పెన్షన్లు రద్దు అన్నది ఎన్నికల నినాదం కావాలి.