Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వసతిగృహాల్లో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

బీసీ చేతి, కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం దరఖాస్తు కోసం 2021 ఏప్రిల్‌ నుంచి జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సైతం చెల్లుబాటు అవుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

సాయం కోసం ఇప్పటివరకు 53 వేల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి సమీక్ష నిర్వహించారు.

‘‘కులవృత్తులకు ఉపయోగపడే ముడిసరకులు, పరికరాల కొనుగోలుకు రూ.లక్ష ఆర్థిక సహాయం ఉపయోగపడుతుంది. కులవృత్తుల కుటుంబాల వారు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మొబైల్‌ నుంచి పూర్తి చేసేందుకు వీలుగా సరళంగా రూపొందించాం.

దరఖాస్తుదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదు. అవసరమైన వారికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి’’ అని మంత్రి ఆదేశించారు.

వసతిగృహాల్లో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

రాష్ట్రంలోని 703 బీసీ ప్రీ మెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌ వసతి గృహాల్లో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని మంత్రి గంగుల తెలిపారు. ఈ మేరకు https://bchostels.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తిచేసి, ఎవరి ప్రమేయం లేకుండానే నేరుగా ప్రవేశాలు పొందవచ్చన్నారు.

Also read: మహిళా దినోత్సవం.. ట్విట్టర్లో హాట్ హాట్ ట్వీట్స్.

బధిరులు, అంధుల విద్యా సంస్థల్లో ప్రవేశాలు

దివ్యాంగుల సంక్షేమ శాఖ పరిధిలోని బధిరులు, అంధుల ఆశ్రమ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో 2023-24 ఏడాది ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బి.శైలజ తెలిపారు.

బధిరుల పాఠశాలల్లో ప్రవేశాలకు మలక్‌పేట 9440362946, నల్గొండ జిల్లా అవంతిపురం 9000013632, కరీంనగర్‌ విద్యానగర్‌ 9000013639 నంబర్లలో… అంధుల పాఠశాలల్లో ప్రవేశానికి మహబూబ్‌నగర్‌ 9618243794, కరీంనగర్‌ విద్యానగర్‌ 9494317315 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.