Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అక్రమంగా చెరువు మట్టి తరలింపు

జేసిబితో మట్టి తవ్వకాలు.
పిర్యాదు చేసిన పట్టించుకోని తహసీల్దార్.
నల్లెళ్ల,మేగ్యాతండా, తాటియతాండలో అక్రమార్కుల ఇష్టారాజ్యం.
మహబూబాబాద్ జిల్లా,కురవి,(నిజం న్యూస్),జూన్,12:అధికార పార్టీకి చెందిన ఓ నాయకులు చెరువుల మట్టిని అతడి వ్యవసాయ క్షేత్రానికి తరలించుకుపోతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

మట్టి తరలింపు విషయంలో గ్రామస్తులు కురవి తహశీల్దార్ కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు.కురవి మండలం తాటియతండ ఎస్సారెస్పీ సమీపంలో,నల్లెళ్ల గ్రామ పెద్ద చెరువు,అలాగే మేగ్యాతండా పరిధిలోని ముసలోని చెరువు నుంచి కొద్ది రోజులుగా జేసిబిలతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు.

అలాగే తాటియతాండ ఎస్సారెస్పీ కాల్వ సమీపంలో బీఆర్‌ఎస్‌ నాయకులు శివారులో సుమారు వ్యవసాయ క్షేత్రంలోకి మట్టి తరలిస్తున్నారు. భూమి ఎగుడు దిగుడుగా ఉండడంతో చదును చేయాలని భావించారు.

అందుకు పెద్ద మొత్తంలో మట్టి అవసరం ఉండగా చెరువులో ఎస్సారెస్పీ సమీపంలో మట్టిపై కన్నేశారు.జేసిబిల సహాయంతో చెరువులో గుంతలు తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి చదును చేయిస్తున్నారు.

రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకుల చర్యల కారణంగా నల్లెళ్ల పెద్ద చెరువు, మేగ్యాతండా పరిధిలోని ముసలోని చెరువు ప్రస్తుతం బొందలమయంగా మారింది.

ఇది కూడా చదవండి….అందత్వం ఆమెను అడ్డుకోలేకపోయింది

ఎండాకాలం కావడంతో చెరువులో నీరు తక్కువగా ఉండడంతో సదరు నాయకులు తాటియతాండ ఎస్సారెస్పీ సమీపంలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు.సుమారు పది ఫీట్ల లోతు వరకు గుంతలు తవ్వి మట్టిని తరలిస్తున్నారు.

చెరువులో ఎక్కడ చూసిన గుంతలే కనిపిస్తున్నాయి.చెరువుల్లో పూడిక తీసేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా గతంలో నల్లెళ్ల చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టేవారు. అయినప్పటికీ చెరువులో పెద్ద మొత్తంలో మట్టి తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం.

దీంతో వర్షాకాలంలో చేరిన నీరు అందులో నిలిచి ఉండేది.ప్రస్తుతం అందుకు భిన్నంగా అక్కడక్కడ లోతైన గుంతలను తవ్వుతున్నారు. ఇలాంటి తవ్వకాల వల్ల చెరువుపై ఆధారపడ్డ వారికి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

పిర్యాదు చేసిన పట్టించుకోలేదు :

నల్లెళ్ల పెద్ద చెరువులో కొంతమంది తమ వ్యవసాయ క్షేత్రంలోకి జేసిబితో సుమారు 20 ట్రాక్టర్ల సహాయంతో పెద్దమొత్తంలో అక్రమంగా చెరువు మట్టి తరలిస్తున్నారని కురవి మండల తహసీల్దార్ కు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు బండి మల్లయ్య,ఆవుల ఉప్పలయ్య, తోట రాములు, ఆవుల కందయ్య,అక్కినపల్లి కృష్ణ, సారక్క మల్లయ్య,తోట యాదయ్య, చెన్నబోయిన ఉపేందర్,సిహెచ్ శ్రీను,పేరం వీరస్వామి ఆరోపించారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.