భూపాలపల్లి బిఆర్ఎస్ లో సీటు కొట్లాట..!
-రెండుగా చీలిపోయిన బిఆర్ఎస్ వర్గీయులు
-లాభ పడనున్న కాంగ్రెస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జూన్ 10 నిజం చెపుతాం
భూపాలపల్లి బిఆర్ఎస్ లో సీటు కొట్లాట తారాస్థాయికి చేరింది. దీంతో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి వర్సెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనుయాయులు రెండు వర్గాలుగా చీలిపోవడంతో భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లాభపడే అవకాశాలున్నట్లు పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నాడు ఉద్యమ నేతగా కీలక పాత్ర పోషించి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సిరికొండ మధుసూదనాచారి ఎన్నో అవమానాలను భరిస్తూ.. ఆటంకాలను ఎదుర్కొంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచి..ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా..ఉద్యమ వ్యూహ రచన చేసిన మధుసూదనా చారి..ముఖ్యమంత్రి కేసీఆర్ కు కుడి భుజంలా వ్యవహరించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సిరికొండను ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించి..2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు భూపాలపల్లి టికెట్ కేటాయించి గెలిపించుకొని, సముచిత స్థానం కల్పించి..తొలి శాసనసభ పతిగా నియమించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిరికొండ మధుసూదనాచారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఇది కూడా చదవండి….షార్ట్ సర్క్యూట్ తో స్కూల్ బస్సు దగ్ధం
అదేవిధంగా సిరికొండ మధుసూదనాచారి కోరిక మేరకు భూపాలపల్లి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి.. జయశంకర్ పేరు పెట్టడంతో పాటు..భూపాలపల్లి అభివృద్ధికి వందల కోట్ల రూపాయలను వెచ్చించిన తీరును భూపాలపల్లి ప్రజలు నెమరు వేసుకుంటున్నారు.
కాగా 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిరికొండపై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందారు. అనంతరం ఆయన తన సన్నిహితులతో భూపాలపల్లి అభివృద్ధి కోసమంటూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నాటి నుండి సిరికొండ వర్గీయులైన తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కడం లేదని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులకు పెద్దపీట వేస్తూ..ఉద్యమకారులను అణచివేస్తున్నారనే కారణంతో భూపాలపల్లి బీఆర్ఎస్ లో వర్గపరు మొదలై సిరికొండ వర్సెస్ గండ్ర వర్గీయులుగా రెండుగా చీలిపోయి..పార్టీకి నష్టం కలిగిస్తున్నారని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ లాభపడే అవకాశం ఉన్నందున ప్రజల మనసును గెలిచిన అభ్యర్థికి బిఆర్ఎస్ టికెట్ ను కేటాయించాలని, లేకుంటే మొదటికే మోసం వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.