Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నాణ్యత లేక నాశనం అవుతున్న డ్రైనేజీ బల్లలు

నాణ్యత లేక చితికిపోతున్న డ్రైనేజీ బల్లలు

*జీవితకాలం పనిచేయవలసిన సిమెంట్ బల్లలు నెల రోజులకే జీర్ణావస్థకు చేరుకున్న వైనం.
*నాణ్యతా ప్రమాణాలను పాతిపెట్టి , తూతూ మంత్రంగా కానిచ్చేసిన గుత్తేదారు.
*ప్రజాధనాన్ని వృధా చేసేందుకు చేపట్టే ప్రభుత్వ పనులు ఇలాగే ఉంటాయనేదానికి దీన్ని మచ్చుగా చూపించారని చుట్టుముట్టిన విమర్శలు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం, జూన్ 9,నిజం చెపుతాం (బ్యూరో) :: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామీణ మండలం వెల్ల గ్రామంలో పాటి మీద శెట్టిబలిజ రామాలయాన్ని ఆనుకొని ఇటీవల నిర్మించిన డ్రైనేజీకి వేసిన సిమెంట్ బల్లలు నాణ్యతాలోపం కారణంగా చితికి శిథిలమై పోతున్నాయి.

జీవితాంతం పనిచేయవలసిన సిమెంట్ బల్లలు వేసిన నెల రోజులకే జీర్ణ దశకు చేరుకుని ముక్కలు, చెక్కలు కింద అయిపోవడంతో స్థానికులు విమర్శలకు తెర లేపినట్టయింది. ఇదే డ్రైనేజీపై పొడవునా బల్లలు వేయవలసిన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి…ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ

డబ్బులకు కక్కుర్తి పడి నాణ్యతా ప్రమాణాలను తుంగలోకి తొక్కడం వల్ల కట్టడాలు ఇలాగే నిర్వీర్యమవుతాయని ప్రజలు వాపోతున్నారు. నమ్మకంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే వీళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నమ్మకాలను వమ్ము చేస్తున్నారని,సొమ్ములకు కక్కుర్తి పడి పనులను నాసిరకంగా నెరవేరుస్తున్నారని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు.

మరోవైపు నాడు నేడు నిధుల్లోనూ గోల్మాల్ కి ప్రయత్నం చేసి సిమెంటు, ఇసుక వాడుకునేందుకు ఎవరికో ఇవ్వగా దాన్ని నిజం దినపత్రిక ఆ నిజాలను వెలుగులోకి తేవడంతో గుట్టు సప్పుడు కాకుండా సిమెంట్ బస్తాలు, ఇసుక యధా స్థానంలో పెట్టడం జరిగిందని గ్రామ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదే మాదిరిగా నాసి రకం పనులతో ప్రజలను మాయ చేసినట్లయితే సంబంధిత నాయకులకు ఇకపై మనుగడ ఉండదని జనం హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు వెల్ల లో జరిగిన నాసిరకం పనులను పరిశీలించి, దానిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వెల్ల గ్రామం ప్రజలు కోరుతున్నారు.

శుక్రవారం “నిజం చెపుతాం” దినపత్రిక బ్యూరో ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ తో చరవాణిలో సంప్రదించగా ఈ డ్రైనేజీ పై వేసిన బల్లలు చితికి పోతున్న సమాచారం తనకు తెలియదని, వెల్ల గ్రామం వెళ్లి పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.
–ఆర్డబ్ల్యూఎస్ డి ఈ ఈ,
మండపేట.