రాజకీయాలకతీతంగా ములుగు అభివృద్ధి
రాజకీయాలకతీతంగా ములుగు అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ…..
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటిఆర్.
133 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.
120 కోట్ల విలువ గల సబ్సీడీ పథకాలు, ఆస్తులు పంపిణీ.
ములుగు జిల్లా ప్రతినిధి, నిజం చేపుతాం, జూన్ 7:- రాజకీయాలకతీతంగా ములుగు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు.
బుధవారం ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, రామప్ప కట్ట వద్ద ఏర్పాటుచేసిన సాగునీటి దినోత్సవ వేడుకలలో హోంశాఖ మంత్రివర్యులు మహమ్మద్ అలీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్లతో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ 65 కోట్లతో నిర్మించే సమీకృత కలెక్టరేట్ భవనానికి, 38 కోట్ల 50 లక్షలతో నిర్మించే జిల్లా పోలీసు కార్యాలయానికి, 10 కోట్ల 40 లక్షలతో నిర్మించే ప్రభుత్వ కార్యాలయ భవనాలకు, కోట 25లక్షలతో నిర్మించే బస్ స్టాండ్ కు, 50 లక్షలతో సేవాలాల్ భవన నిర్మాణానికి, 30 లక్షలతో డిజిటల్ లైబ్రరీ భవనానికి, 1 కోటి తో వైకుంఠ ధామం నిర్మాణానికి, 15 లక్షలతో సమాచార పౌర సంబంధాల శాఖ సమావేశ మందిర నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 12 కోట్ల 50 లక్షలతో ములుగు జిల్లాలో నిర్మించిన 5 మార్డెన్ పోలీస్ స్టేషన్లను, 2 కోట్లతో నిర్మించిన సిసి రోడ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మహాకవి దాశరధి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే సీఎం కేసీఆర్ తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగానిగా మార్చి చూపారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆచార్య జయశంకర్ సారధ్యంలో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ అద్భుత రీతిలో దేశంలో ఆదర్శవంతంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి…ఆదివాసీ మహిళ పై అత్యాచారయత్నం
గత పాలకుల హయాంలో వేసవికాలంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ఊర్లలో తిరగాలంటే భయపడేవారని, త్రాగునీటి ఇబ్బందులతో ప్రజలు ఖాళీ బిందెల ప్రదర్శనలు చేసే వారని, 67 సంవత్సరాల పాటు పాలించి త్రాగు సాగునీటి కష్టాలను తీర్చనివారు నేడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అన్నారు.
సుదీర్ఘ పోరాటం ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుంటే, కొంతమందికి మింగుడు పడటం లేదని, ఉత్సవాలు ఎందుకు నిర్వహించాలనే వితండవాదం చేసేవారి పార్టీ ఛత్తీస్గడ్ లో ప్రభుత్వంలో ఉందని , అక్కడ ఎకరానికి 12 క్వింటాలు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, రైతులకు ఉచిత విద్యుత్తు, పంట పెట్టుబడి సహాయం, ఇంటింటికి త్రాగునీరు సరఫరా ఉన్నాయా అని మంత్రి ప్రశ్నించారు.
గతంలో 60 సంవత్సరాల ప్రజల చిరకాల ఆకాంక్ష 3146 గిరిజన తండాలు గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ రాజకీయాలకతీతంగా ములుగును ప్రత్యేక జిల్లా కేంద్రంగా, మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి 133 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల చేపడుతున్నామని అన్నారు.
ములుగు జిల్లాలో దళితులకు 2 కోట్ల 39 లక్షల సబ్సిడీ, గిరిజనులకు కోటి 48 లక్షలు సబ్సిడీ, మూడు వేల యాదవులకు గొర్రెల పంపిణీ యూనిట్లు, 33 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, 1181 మహిళా సంఘాలకు 110 కోట్ల చెక్కు, సబ్సిడీపై మూడు ట్రాక్టర్లు 44 లక్షల విలువగల పనిముట్లను, 37 మందిర్ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ములుగు నియోజకవర్గ పరిధిలో 17వేల ఎకరాల పోడు పట్టాలను పంపిణీకి సిద్ధం చేశామని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ కారణంగా జాతీయ పంచాయతీ అవార్డులలో దేశస్థాయిలో రెండవ స్థానంలో నిలిచామని, 67 కొత్త గ్రామపంచాయతీలు రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
గతంలో ఏజెన్సీ ప్రాంతాలలో మంచం పట్టిన మన్యం అనే వార్తలు వచ్చేవని, సర్కారు దవాఖానాల్లో వసతులు వైద్యులు ఉండేవారు కాదని నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అనే పాటలు వచ్చాయని , ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలలో విశ్వాసం పెంచి జిల్లా ఆసుపత్రి నిర్మాణం చేసుకున్నామని జిల్లాలో వైద్య కళాశాల సైతం మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 34 నుంచి 80 శాతానికి పెరిగిందని, ప్రజలలో ప్రభుత్వం పట్ల ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని కేటీఆర్ తెలిపారు. నీళ్ల ద్వారా సంక్రమించే వ్యాధులు గణనీయంగా తగ్గిపోయాయని, ములుగు నియోజకవర్గ పరిధిలో 74,774 మంది రైతులకు 644 కోట్ల రైతుబంధు , 986 రైతు కుటుంబాలకు 48 కోట్ల 30 లక్షల రైతు బీమా సొమ్ము 40,000 మందికి ఆసరా పింఛన్లు , 3141 కెసిఆర్ కిట్లు అందించామని, కంటి వెలుగు కార్యక్రమం కింద 1 లక్ష 66 వేల మందికి పరీక్షలు నిర్వహించి 40000 అద్దాలు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ప్రజలకు వైద్య పరీక్షల నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే పైలట్ ప్రాజెక్టులో రాజన్న సిరిసిల్ల జిల్లా తో పాటు రాజకీయాలకతీతంగా వెనుకబడిన ములుగు జిల్లాల సైతం ఎంపిక చేసి లక్ష అరవై రెండు వేల మందికి పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించామని అన్నారు.
ప్రజలలో మల్లంపల్లి మండల కేంద్రం ఏర్పాటుకు ఉన్న డిమాండ్ కు సానుకూలంగా స్పందించి త్వరలో ఏర్పాటు చేయుటకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అవసరాలను తీరుస్తూ విపక్షం, స్వపక్షం అనే తేడా లేకుండా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయంలో మాత్రమే ములుగు అభివృద్ధి జరిగిందని, ప్రతి తండాకు పైప్లైన్ ద్వారా ఇంటింటికి నల్ల అందిస్తున్నామని, 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా రైతులకు చేస్తున్నామని తెలిపారు.
గతంలో అందించే 200 పెన్షన్ను కెసిఆర్ రెండు వేలకు పెంచారని, జిల్లా కేంద్రంలో ఆసుపత్రి నిర్మించుకున్నామని వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని, మన పక్కనే ఉన్న మహారాష్ట్ర చత్తీస్గడ్ రాష్ట్రాలలో నీటి కరెంట్ కష్టాలు ఉన్నప్పటికీ మన దగ్గర సమృద్ధిగా త్రాగునీరు సాగునీరు అందిస్తూ నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన తెలిపారు.
మహిళా గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో 100 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని, సమ్మక్క సారలమ్మ జాతర్లను రాష్ట్ర పండుగగా గుర్తించి, 4 సార్లు నాలుగు సార్లు జరిగిన జాతరకు 400 కోట్లు ఖర్చు చేసి ఘనంగా నిర్వహించామని అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం 334 ఎకరాల భూ బదలాయింపు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు చేయడం లేదని, సమ్మక్క జాతరను జాతీయ పండుగ చేయాలనే డిమాండ్ సైతం పక్కకు పెట్టిందని పేర్కొన్నారు.
అనంతరం రామప్ప దేవాలయంలోని శిల్ప సంపదను పరిశీలించిన మంత్రి కేటీఆర్ రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప చెరువు కట్ట వద్ద ఏర్పాటుచేసిన సాగునీటి దినోత్సవ వేడుకలలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రివర్యులు మహమ్మద్ అలీ, శాసనమండలి సభ్యులు రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి , వాటర్ కమిషన్ చైర్మన్ వి ప్రకాష్ రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ జగదీష్ మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, దనసరి అనసూయ సీతక్క, శాసనసభ సభ్యులు, జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, గౌష్ ఆలం, ఎస్పీ, బడే నాగజ్యోతి, వైస్ చైర్ పర్సన్, జిల్లా పరిషత్,వి. ప్రకాష్ రావు, చైర్మన్, తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ, వై సతీష్ రెడ్డి, చైర్మన్, టీఏస్ రెడ్క్ఒ వాసుదేవా రెడ్డి, చైర్మన్, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ, పోరిక గోవిందు నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ, గండ్రకోట శ్రీదేవి ఎంపీపీ, సకినాల భవాని జడ్పిటిసి, గొర్రె సమ్మయ్య, మావురపు తిరుపతి రెడ్డి, ఇండ్ల సుజాత, బండారి నిర్మల, ములుగు సర్పంచ్,అక్కల రగోతం సర్పంచ్, బండారుపల్లి,ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల, బి. విజయ్ భాస్కర్ రావు, చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.