Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బదిలీల ప్రక్రియ షురూ…

ముందుగా ఆర్డీవోలు తాసిల్దార్లు అనంతరం కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లు కూడా

మహబూబాబాద్ బ్యూరో జూన్ 07 నిజం న్యూస్

హైదరాబాద్‌: ఈ ఏడాది చివరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒకే చోట మూడేళ్లకు పైగా విధులు నిర్వర్తిస్తున్న, సొంత జిల్లాల్లో పనిచేస్తున్న ఎన్నికల నిర్వహణకు సంబంధించిన శాఖల అధికారులను బదిలీ చేసేందుకు జాబితాలను రూపొందిస్తున్నారు.

ఆర్డీవో, తహసీల్దార్ల బదిలీలపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బదిలీలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి సంబంధిత అధికారుల సమాచారాన్ని సీసీఎల్‌ఏ సేకరించింది. డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారి సమాచారాన్నీ బదిలీల్లో పొందుపరిచారు.

Also read: రోడ్డు పక్కనే పడవేస్తున్న చికెన్ వ్యర్ధాలు

ఇతర శాఖలకు వెళ్లి మూడేళ్లు గడవకున్నా కేటాయించిన జిల్లాలో నిర్దేశిత గడువు ముగియడాన్ని పరిగణనలోకి తీసుకొని, వారినీ బదిలీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా మండలాలు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్లలో తహసీల్దారు కేడర్‌లో 800 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు.

వీరిలో సుమారు 500 మంది బదిలీ అయ్యే అవకాశాలున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ కలెక్టర్లు(ఆర్డీవో) వంద మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారు, ఇతరత్రా కేసులు ఏవైనా నమోదై ఉంటే వారి సర్వీస్‌ రికార్డుల్లోని వివరాల ఆధారంగా బదిలీల్లో స్థానాలు కేటాయించనున్నారు.

కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు కూడా..

ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్ల బదిలీలనూ త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. రెండు వారాల్లోగా ఆర్డీవోలు, తహసీల్దార్ల బదిలీల ప్రక్రియను పూర్తి చేసి, రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ముగిసిన అనంతరం కలెక్టర్ల బదిలీలపై ప్రభుత్వం దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది.

గతంలో జరిగిన ఎన్నికల్లో నిర్వహణపరమైన నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఉన్నతాధికారుల పోస్టింగ్‌లపై ప్రభావం పడనున్నట్లు తెలిసింది. పోలీసుశాఖ బదిలీలపై కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉండడంతో.. త్వరలో ఎస్సై, సీఐ, డీఎస్పీల బదిలీల ప్రక్రియ కూడా చేపట్టనున్నారు.