Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నీతి ఆయోగ్‌ సాధించిందేమిటి ?

ప్రధానమంత్రి మోడీ సమక్షంలో… ఇటీవల జరిగిన నీతి ఆయోగ్‌ భేటీలో పలు అంశాలపై చర్చ జరగడం అటుంచితే..పలు రాష్టాల్ర ముఖ్యమంత్రులు హాజర్ కాలేదు. అలాగే పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి కూడా పలువురు సిఎంలు, పార్టీల నేతలు దూరంగా ఉన్నారు.

ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సంక్షేమం అన్నది ఉమ్మడిగా నిర్ణయించి ముందుకు సాగాల్సి ఉంది. పార్లమెంటులో సమస్యలపై చర్చించడం లేదు. నీతి ఆయోగ్‌లోనూ ప్రధాని ప్రసంగానికే పెద్దపీట వేస్తున్నారు. హాజరైన సిఎంలు ప్రస్తావించిన అంశాలపై చర్చించడం లేదా, తదుపరి చర్యలు కానరావడం లేదు.

మొత్తంగా దేశంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారం లో ఉన్నా సమావేశాలు, చర్చలు అన్నవి తూతూ మంత్రంగా సాగుతున్నాయి.సమావేశాలు, చర్చలు అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా సాగడం చూస్తున్నారు.

అనేక సందర్భాల్లో నీతి ఆయోగ్‌ సమావేశాల్లో అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రులు వివిధ సమస్యలపై నేరుగానే ప్రశ్నించారు. ఆయా రాష్టాల్ర సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లారు. అయినా లాభం లేకపోవడంతో ఇక సమావేశాలకు హాజరు కావడం దండగ అన్న భావనలో ఉన్నారు. నీతి ఆయోగ్‌ ప్రారంభించి సమయంలో కనిపించిన స్ఫూర్తి లోపించింది.

నీతి ఆయోగ్‌ ఏర్పాటు దశలో ప్రధాని మోడీ ఆనాడు చేసిన ప్రకటనకు భిన్నంగా ఈ తొమ్మిదేళ్లుగా నీతి తప్పిన ఆయోగ్‌గా అవతరించింది. సహకార సమాఖ్య సూత్రాలకు అనుగుణంగా మొత్తం దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయా రాష్టాల్రకు తగిన గౌరవం ఇచ్చి వారిని కూడా ఇందులో భాగస్వాములను చేయాల్సి ఉంది.

ఇది కూడా చదవండి….మూసి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్టాల్రను కలుపుకుని ముందుకు సాగాల్సిన కేంద్రం ఆ దిశగా పనిచేయడం లేదు. మళ్లీ పాతపద్దతిలోనే సాగుతోంది. నీతి ఆయోగ్‌ లక్ష్యాలను విస్మరించారు. ఇక్కడ జరిగే చర్చలకు పెద్దగా ప్రాధాన్యం ఉండడం లేదు. ఇదే విషయాన్ని పలువురు సిఎంలు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. అంతెందుకు ఒకే పన్ను విధానం అంటూ తీసుకుని వచ్చిన జిఎస్టీని సమర్థించిన ఆయా రాష్టాల్ర సిఎంలే ఇప్పుడు దాని బారినుంచి రక్షించాలని కోరుకుంటున్నారు.

వివిధ రంగాలపై అది చూపిస్తున్న చెడు ప్రభావాన్ని విశ్లేషించు కోవాల్సిన కేంద్రం ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందే తప్ప ప్రజల కోణంలో ఆలోచించడం లేదు. ప్రజలు అనేక సందర్భాల్లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును సొంత అవసరాలకు తీసుకోవ డానికి కూడా ఇబ్బంది పడటాన్ని గ్రామాల్లో ఇప్పటికీ చూస్తున్నాం.

నగదు ఉపసంహరణపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఇలాంటి వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆహారధాన్యాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ నీతి ఆయోగ్‌లో చర్చించడం లేదు. పార్లమెంటులో చర్చకు అవకాశం ఉండడం లేదు. మొత్తంగా పాలకులకు అధికారమే తప్ప ప్రజలు కనబడడం లేదు.

ఎంపిలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్‌ వ్యవస్థ ఇలా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం బదులు నానాటికి దిగజారుస్తున్నాయి. ప్రజల డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చవుతోంది. రాజకీయాల్లో ఎదుటి పక్షాలను ఢీకొట్టేందుకు తమ తెలివిని ఉపయోగి స్తున్న పాలకులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ద చూపడం లేదు.

ఈ దశలో ఇలాంటి ప్రజాస్వామ్యం కొనసాగితే మరో 75 ఏళ్లయినా మన భారత్‌ రాత మారదు. రాజకీయ సంస్కరణలు రావాలి. పాలకుల తీరులో మార్పు రావాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కళ్లెం పడాలి. ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను పాలకుల విసలాలకు ఖర్చు చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి….ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

రాజ్యాంగం ఏ మేరకు ఎంతవరకు అమలు సాధించామన్నది పాలకులుగా రాజకీయ పార్టీల నేతలు మననం చేసుకోవాలి. అందరికీ సమ న్యాయం అందుతుందా అన్నది చూడాలి. నేలవిడిచి సాము చేసే విధంగా దేశీయంగా ఉత్పత్తులపై దృష్టి
పెట్టి స్వయం సమృద్ది సాధించకుండా దావోస్‌ లాంటి వేదికలపై పెట్టుబడులకు వెంపర్లాడుతున్న విధానం పోవాలి.

దేశీయంగా ఉన్న సాంకేతి కతను ఉపయోగించుకుని యువతను స్వయం సమృద్దికి సన్నద్దం చేయాలి. వ్యవసాయం, అనుబంధ రంగాలను అభివృద్ది చేస్తే ఈ దేశం ఇతర దేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయగలదు. సింగపూర్‌, మలేషియా తదితర చిన్నదేశాలను ఆదర్శగా తీససుకుని ఆయా రాష్టాల్రు స్వయం సమృద్ది సాధించే ప్రణాళికలతో సాగాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

ప్రజలు సంపూర్ణత సాధించేలా పథకాలు అమలు కావడం లేదు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఆరోగ్యం అందని ద్రాక్షగా మారింది. విద్య విలాసవస్తువుగా మారింది. ఇలాంటి అసమనాతలను రూపుమాపేందుకు పాలకులు చిత్తశుద్దితో కృషి చేయాలి.

ఆనాటి పాలకుల దూరదృష్టి లోపం కారణంగా మనకు వారసత్వంగా వచ్చిన సకల అవలక్షణాలు ప్రజలను ఇంకా దరిత్రంలోనే ముంచెత్తుతున్న వేళ పాలకులు గతాన్ని నెమరేసుకుని ముందుకు సాగాల్సిన వేళ ఇది. ఇంతకాలం ఎక్కడ లోపం ఉందో గుర్తించి అవలోకనం చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి.

విద్యావైద్యరంగం ఎందుకు వెనకబడి ఉందో తెలుసుకోవాలి. ఆహారధన్యాలను ఇంకా ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామో ఆలోచన చేయాలి. రాజకీయ దృక్కోణంలో కాకుండా అభివృద్ది కోణంలో పాలన చేయాల్సిన విషయాన్ని పాలకులు వంటబట్టించు కోవాల్సి ఉంది.

ఐదేళ్లు అధికారంలోకి రాగానే మరో ఐదేళ్లు గద్దెపై ఉండడ మెలా అన్న ఆలోచన చేయడం వల్లనే భారత్‌ కూడా ఇంకా దారిద్యం, నిరక్షరాస్యత, వసతుల కొరత, ఆహారధాన్యాల కొరతతో అలమటిస్తోంది. ఇదంతా పాలకుల దృష్టి లోపంగా చూడాలి. నిజానికి దేశంలో నల్లధనం, అవినీతి పోవాలంటే రాజకీయ పార్టీల నుంచే ప్రక్షాళన మొదలవ్వాలి.

నల్లధనం రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకుని ఓటర్లను కొనుగోలు చేయడానికి వాడుతున్నాయి. ఎన్నికలు అయ్యాక తగిన మెజారిటీ సమకూరని సందర్భాలలో ఎమ్మెల్యేలు లేదా ఎంపీల బేరసారాల కోసం ఈ నల్లధనాన్నే వాడుతున్నారు.

వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలలో అత్యధిక భాగం నల్లడబ్బు రూపంలోనే ఉంటోంది. ఈ పరిస్థితిని నివారించకుండా ఎన్ని సంస్కరణలు చేసినా ఫలితం ఉండదు. ప్రజలకు అందని నగదు రాజకీయ పార్టీలకు మాత్రం లభిస్తోంది.

ఎన్నికల్లో ఆయా పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వైనం చూస్తున్నాం. అన్నిరంగాల్లో మనం ముందంజ వేయాల్సిన దశలో ఇంకా దిగుబడులపై ఆధారపడుతూ ఎగుమతుల విషయంలో లక్ష్యం లేకుండా సాగుతున్నాం.

మనం చేపట్టిన సంస్కరణలు ఫలితాలు ఇవ్వడం లేదన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఎన్నికలలో డబ్బు అవసరం లేకుండా సంస్కరణలు తీసుకు రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేదు.

రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారమే కనుక, ఆ అధికారం కోసం ఎంతకైనా తెగబడతాయని ఈ 75 ఏళ్లలో నిరూపితం అయ్యింది. నీతి ఆయోగ్‌ను బలోపేతం చేస్తూ రాష్టాల్రను విశ్వాసంలోకి తీసుకుని ఉమ్మడిగా ముందుకు సాగాల్సి ఉంది. అప్పుడే దేశం అభివృద్ది సాధిస్తుందని గుర్తించాలి.