Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కోరమాండల్‌ కు మూడుసార్లూ శుక్రవారం రోజే ప్రమాదం

20 ఏళ్లలో 3 సార్లు కోరమాండల్ కు ప్రమాదం..రెండు సార్లు ఒడిశాలోనే!

మహబూబాబాద్ బ్యూరో జూన్ 03 నిజం న్యూస్

ఒడిశాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటన యావత్‌ దేశాన్ని కుదిపేసింది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాద ఘటనల్లో ఒకటిగా నిలిచింది.

శుక్రవారం నాటి ఘటనతో కలిపి ఇదే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గడిచిన 20 ఏళ్లలో మూడు సార్లు ప్రమాదానికి గురైంది. హవ్‌డా- చెన్నై మధ్య నడిచే ఈ రైలు.. మూడుసార్లూ చెన్నై వెళ్లే క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. అదీ మూడుసార్లూ శుక్రవారం రోజే ప్రమాదం జరిగింది. ఇందులో రెండుసార్లు ఒడిశాలో, ఒకసారి ఏపీలో జరిగింది.

Also read: మొదట పట్టాలు తప్పింది కోరమాండలే

2022 మార్చి 15న చెన్నై వెళుతున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏపీలోని నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 8 బోగీలు పట్టాలు తప్పాయి. అప్పట్లో ఎవరూ మరణించనప్పటికీ.. 100 మంది వరకు గాయపడ్డారు. నెల్లూరు వద్ద రైలు పట్టాలు సరిగా లేకపోవడం ప్రమాదానికి కారణమైంది.

2009 ఫిబ్రవరి 13న ఒడిశాలోని జైపుర్‌ జిల్లాలో ఇదే రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. 16 మంది మృతి చెందగా.. 200 మంది గాయపడ్డారు.

మళ్లీ 14 ఏళ్ల తర్వాత 2023 జూన్‌ 2న ఒడిశాలోని బహానగా బజార్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ప్రమాదానికి గురైంది. 11 కోచ్‌లు పట్టాలు తప్పగా.. దాదాపు 280 మంది మరణించారు. 800 మందికి పైగా గాయపడ్డారు.