ఏలూరు జిల్లాలో నకిలీ భూమి పట్టాల కలకలం
బ్యాంకు రుణాలతో పాటూ.. ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందుతున్న నకిలీలు
నిజం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో
ఏలూరు జిల్లాలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు కలకలం రేపు తున్నాయి. సెంటు భూమి కూడా లేని ఎంతోమందికి వారి పేరుతో భూమి ఉన్నట్టు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు అయ్యాయి. దీంతో వారు బ్యాంకు రుణాలు పొందడమే కాదు ప్రభుత్వ పథకాలు లో సైతం లభ్ది పొందుతుండడం విశేషం.
భూములు కలిగి ఉన్నా.. పట్టాదారు పాసుపుస్తకాల కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నా.. కనికరించని అధికారులు నకిలీ పట్టాలు విషయంలో రైట్.. రైట్.. అంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో ఆడారి. కనకవర విజయలక్ష్మి కి భూమి లేకపోయినా 4 ఎకరాల భూమి ఉన్నట్లు గతంలో పనిచేసిన తహసీల్దార్ సంతకంతో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు అయ్యాయి.
అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు జగనన్న కు చెబుదాం కార్యక్రమంలో ఆర్డీవో కు ఆధారాలతో సహ ఫిర్యాదు చేశారు. నకిలీ పట్టాలు జారీ విషయంలో వి. ఆర్ ఓ హస్తం ఉన్నట్లు చెబుతున్నారు.
ALSO READ: ఇండియా బాలికల బాస్కెట్ బాల్ పోటీలకు కిరణ్మయి ఎంపిక
ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇదే తరహాలో జిల్లాలో అనేక గ్రామాల్లో నకిలీ పట్టాలు ఉన్నాయని తెలుస్తోంది. రైతులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకంలో సైతం లబ్ధిపొందుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా బ్యాంక్ లు కూడా ఎకరా భూమి ఉంటే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుండడంతో ఈ నకిలీ లు కూడా ఎంచక్కా రుణాలు పొందుతున్నారు. తహసీల్దార్ సంతకం సీల్ తో పాస్ పుస్తకాలు వస్తూండడం వెనుక ఖచ్చితంగా రెవిన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో పని చేసి బదిలీ అయిన తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేసి పాసుపుస్తకాలు అందిస్తున్నారు. ఈ నకిలీ పట్టాలు విషయంలో అధికారులు సీరియస్ గా ఉన్నారు. వెంటనే ఈ గుట్టును రట్టు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలో నకిలీ పట్టాలు ఎన్ని ఉన్నాయి వాటి వెనుక ఎవరి హస్తం ఉందనే విషయం త్వరలోనే బయట పడే అవకాశం ఉంది.