గోదావరి తీరాన చంద్రబాబు హామీల వర్షం
*ప్రజాకర్షక పధకాలకు మెనూఫెస్టోలో పెద్ద పీట..
*తల్లికి వందనం పేరుతో పదిహేనువేలు..
*18 సంవత్సరాలు నిండిన వారికి నెలకు1500..
* యువగళం పధకం ద్వారా నిరుద్యోగులకు నెలకు 3 వేలు
*రైతుల కోసం అన్నదాత పధకం కింద 20 వేలు..
*బి. సి వర్గాలకు రక్షణ చట్టం..
తూర్పుగోదావరి జిల్లా.. రాజమహేంద్రవరం..
(చల్లా శ్రీనివాస్.. నిజం రిపోర్టర్)..
మే 28.. నిజం న్యూస్…
రాజమహేంద్రవరం సమీపాన వేమగిరిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాల్లో రెండవ రోజు సమావేశానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది కార్యకర్తలు హాజరయ్యారు. ఒకపక్క వర్షం విస్తారంగా కురుస్తున్నప్పటికీ కార్యకర్తలు మాత్రం చెదరని అకుంఠిత దీక్షతో కార్యక్రమంలో పాల్గొన్నారు.
సభా వేదిక మొత్తం స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం పలువురు ప్రముఖులు వివిధ విషయాలపై ప్రసంగించిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను విడుదల చేసారు.
ఈ మేనిఫెస్టో నందు గల వివిధ ప్రజా సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రజనీకానికి వివరించే ప్రయత్నం చేసారు.ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో మహిళల కోసం మహాశక్తి,యువత కోసం యువ గళం,రైతుల కోసం అన్నదాత కార్యక్రమం,ఇంటింటికి తాగునీరు,బీసీ సామాజిక వర్గాలకు రక్షణ చట్టం, ప్రత్యేకించి పూర్ టూ రిచ్ అనే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
అలాగే ఆడబిడ్డ నిధిని ఏర్పాటు చేసి 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని బాబు ప్రకటించారు.ఈ పథకం ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ కూడా వర్తిస్తుందని తెలియజేసారు. అంతేకాకుండా తాము అధికారంలోకి రాగానే తల్లికి వందనం పేరుతో ఏటా ప్రతి బిడ్డ తల్లి అకౌంట్లో 15 వేల రూపాయలు జమ చేస్తామని ఈ పథకం కింద ముగ్గురు పిల్లలు గల తల్లిదండ్రులకు సైతం ప్రయోజనం అమలు చేస్తామని తెలియజేసారు.
Also read: పోస్ట్ ఆఫీస్ ల్లో 12,828 పోస్టులు
యువగళం పథకం కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు అందజేస్తామని,అలాగే ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లాస్థాయిలో ఉచిత ప్రయాణం కలుగజేస్తామని తెలియజేశారు.రైతులకు అన్నదాత పేరుతో ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందజేస్తామని తెలియజేశారు.
కరోనా సమయంలో పనిచేసిన ఏకైక వ్యక్తి రైతు అని అటువంటి రైతు యొక్క గౌరవం కాపాడేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కలిసి ఉంటే రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేదని చంద్రబాబు అన్నారు. రాజకీయాలకు దుర్మార్గం ఆపాదించి వైసిపి దుష్ట రాజకీయం చేస్తుందని విమర్శించారు.
నాసిరకం మద్యంతో ప్రజలను దోచుకుంటున్నారని,అవినీతి, విధ్వంస పాలన వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో తెలంగాణ ఆదాయం ఏపీ ఆదాయం కంటే బాగా పెరిగిందని పేర్కొన్నారు.
వైసీపీ నేతలు చిల్లర చెత్త పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. తామాధికారంలోకి రాగానే స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనల తొలగిస్తామని,యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని,ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందజేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ కు అభివృద్ధి,సంక్షేమం రెండు చక్రాలని చంద్రబాబు పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు,ప్రముఖ నాయకులు,లక్షల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.