సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా ..!

*యూజర్ చార్జీల పేరిట భారీగా ఖజానాకు చిల్లు
*అక్రమవసూళ్లకు పాల్పడుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయసిబ్బంది
*విధి నిర్వహణలో భాగంగా చాప కింద నీరులా సాగుతున్న అక్రమ వసూళ్ల దందా
*గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 26,(నిజం న్యూస్) బ్యూరో :: రామచంద్రపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రయంలో భాగంగా యూజర్ చార్జీల పేరిట కార్యాలయం సిబ్బంది వేలాది రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
ప్రతినిత్యం భారీ స్థాయిలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. విధి నిర్వహణలో భాగంగా ప్రశ్నించే వారే లేకపోవడంతో ప్రతిరోజు గుట్టు చప్పుడు కాకుండా అక్రమవసూళ్ల దందా సాగిపోతోంది.
స్టాంపులు విక్రయించేటప్పుడు 1 నుంచి 5వేల రూపాయల వరకు యూజర్ చార్జీలు 50 రూపాయలు, 5 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు 100 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా అధిక సంఖ్యలో విక్రయించబడే వంద రూపాయలు స్టాంపులు 100 రూపాయలు లోపు స్టాంపులకు విడివిడిగా 50 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.
కానీ ప్రభుత్వ ఖాతాకు వచ్చేసరికి స్టాంపులు విడివిడిగా 10 అ అమ్మినా లేదంటే 20 స్టాంపులు అమ్మినా ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా రాయకుండా ఈ స్టాంపులు అన్నిటిని ఏక మొత్తంగా ఒకేసారి కూడిక వేసి ఈ సొమ్ము అంతా ఏదో ఎల్లయ్య పుల్లయ్య ఒకే పేరున ఏక మొత్తంగా రాసి ఆ పద్ధు ఎదురుగా యూజర్ చార్జీలు 50 రూపాయలు అని రాసి ఎన్ని స్టాంపులు అమ్మినా గాని ఆ 50 రూపాయలనే ప్రభుత్వానికి ఆదాయంగా చూపిస్తూ… యూజర్ చార్జీలు పేరిట వసూలు చేసిన వేలాది రూపాయలను మడతపెట్టి దారి మళ్లిస్తున్నారు.
ఇలా ప్రతిరోజు అక్రమంగా వేలాది రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల అడ్వకేట్, కౌన్సిలర్, వైయస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ అయిన వాడ్రేవు సాయి ప్రసాద్ అనే పుర ప్రముఖుడు స్టాంపుల నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి 8 స్టాంప్ పేపర్లు తీసుకోగా వాటికి యూజర్ చార్జీలు అని చెప్పి ఒక్కో పేపర్ కి 50 రూపాయలు చొప్పున వసూలు చేసి రికార్డు లో ఆయన పేరు నమోదు చేయకపోవడం ముఖ్యంగా జరిగింది.
దాంతో సాయి ప్రసాద్ నేను 8 స్టాంప్ పేపర్లు కొన్నాను నా పేరు ఎక్కడ నమోదు చేయలేదేంటి అని ప్రశ్నించగా సిబ్బంది ఏదో సర్ది చెప్పడం చేశారని ఆయన తెలిపారు. ఒక బాగా చదువుకున్న వ్యక్తి అడ్వకేట్ కి ఇలా చేస్తే సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏమిటి అని ఆయన సిబ్బందిని నిలదీయడం జరిగింది.
Also read: పేకలు పెట్టాకే పిట్ట ముట్టింది
ఈ తరహాలో సిబ్బంది రోజుకు ఎన్ని వేలు వసూలు చేస్తున్నారన్నది పెరుమాళ్ళకే ఎరుక. అంతేకాక రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎంతోమంది స్టాంపులను కొంటూ ఉంటారు. అలాగే నిత్యం.. న్యాయ వాదులు, నోటరీ అడ్వకేట్సు కోర్టు ఫీజు స్టాంపులు కోసం సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది.
బ్యాంకు లోన్లకు సంబంధించిన ఎంఓడీలు లు చేయించుకోవడం కోసం వెళ్ళేవారు, లోన్లకు సంబంధించిన అఫిడవిట్లు (దస్తావేజుల) పై స్టాంపింగ్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయాలకి వెళ్లాల్సి ఉండటంతో ప్రతిరోజు వేలాది స్టాంపుల విక్రయం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో వేలాది రూపాయలు యూజర్ చార్జీలుగా ప్రభుత్వానికి ఆ కార్యాలయ సిబ్బంది జమ కట్టవలసి ఉంటుంది.కాని అలా ప్రభుత్వానికి జమ కట్టవలసిన వేలాది రూపాయల యూజర్ చార్జీలు పక్కదారి పడుతున్నాయి. దొంగలు ఊర్లు పంచుకున్నట్లు కార్యాలయ సిబ్బంది సైతం పంచుకుంటున్నారని విజ్ఞులు ఆరోపిస్తున్నారు.