బుట్ట బొమ్మ పూజాహెగ్డే నేడు బర్త్ డే

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకిగా వెలుగొందుతోంది నటి పూజా హెగ్డే. సెక్సీ సైరన్ గా పిలవబడే పూజా.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఒక పక్క అందాలను ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. నేటితో (అక్టోబర్ 13) ఈ బుట్టబొమ్మ 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగిన వైనాన్ని గుర్తు చేసుకుందాం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే 2010 విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. 2012లో ‘మాస్క్'(ముగమూడి) అనే తమిళ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆకట్టుకునే అందంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన ‘మెహంజదారో’ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

2017లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంతో తనలోని గ్లామర్ కోణాన్ని బయటపెట్టి తొలి సూపర్ హిట్ అందుకుంది పూజా హెగ్డే. ఈ చిత్రంలో బికినీ అందాలతో కనువిందు చేసింది. ఆ తర్వాత ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాతో పూజా మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. ‘రంగస్థలం’లో ‘జిగేలు రాణి’గా ఐటమ్ సాంగ్ లోనూ అదరగొట్టింది. ఈ క్రమంలో మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ‘హౌస్ ఫుల్ 4’ తో బాలీవుడ్ లో కూడా లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఇక ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోల సరసన నటించేందుకు ఏకైక ఛాయిస్ గా మారిపోయిన ఈ బుట్టబొమ్మ కాస్ట్లీ డేట్స్ కోసం హీరోలు సైతం వెయిట్ చేసే రేంజ్ కి చేరిపోయింది. ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలోనూ నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో సైతం ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.