ఏకధాటిగా 10 గంటల పాటు కళా ప్రదర్శన
కలను కాపాడుతున్న కళాకారులు
చందుర్తి మే 22 (నిజం న్యూస్):
చందుర్తి మండల కేంద్రంలో సాంకేతికతకు దగ్గరై, సంబంధాలకు దూరమై జీవనం సాగిస్తున్న ఈ కాలంలోనూ అక్కడ అనాదిగా వస్తున్న ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
ఓ కుటుంబంలో ఐదు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ప్రస్థానం వివిధ ప్రాంతాలకు విస్తరించడంతోపాటు నేటికీ రంగస్థలం కళను పెంచి పోషిస్తున్న వీరి తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే… ఏకధాటిగా 10 గంటల పాటు సాగే ఈ కళా ప్రదర్శనను వందలాదిమంది ఆ వేదిక వద్దకు చేరుకొని కనులార ప్రదర్శనను తిలకిస్తున్న తీరు ఆదర్శప్రాయం.
సరిగ్గా 48 ఏళ్ల క్రితం రాజూరి విఠలాచార్యులు ఇంట రంగస్థలం ప్రారంభమైంది. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రను నాటక రూపంలో తన సోదరులతో మరియు గ్రామ స్నేహితులతో చేతులు కలిపి ప్రదర్శించడం ప్రారంభించారు.
ALSO READ: ఇది కథకాదు సినిమాతో శరత్ బాబు కు మంచి గుర్తింపు
ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ సంఘానికి రాజూరి విఠలాచార్యులు సాధు సజ్జన నాట్య కళామండలి అని నామకరణం చేశారు. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పంచమి రోజున విఠలాచార్యులు తన శిష్య బృందంతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. విఠలాచార్యులు పరమపదించిన తర్వాత అదే కుటుంబానికి చెందిన రాజూరి జనార్ధనా చార్యులు ఇట్టికల సజీవంగా ఉండడానికి కళా ప్రదర్శనను ఇప్పటికి కొనసాగిస్తున్నారు.
ప్రదర్శన కోసం నెల రోజుల ముందు చైత్ర శుద్ధ పంచమి రోజున ఏకధాటిగా 10 గంటల పాటు జరిగే ఈ నాటక ప్రదర్శన కోసం కళాకారులు నెలరోజులకు ముందు నుండి రిహాల్సల్ చేస్తుంటారు.
అయితే ఉపాధి కోసం ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కూడా సమయం కేటాయించి తీరిక సమయాల్లో ప్రదర్శన కోసం సమాయత్వం అయ్యారు. చైత్ర శుద్ధ పంచమి రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాల నుండి మరుసటి నాడు ఉదయం 6 గంటల వరకు నిరాటంకంగా సాగే ఈ నాటక ప్రదర్శనలు తిలకించేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొని చందుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ మండలాలకు చెందినవారు పట్టణ ప్రాంతాలకు చెందినవారు కూడా ఈ రంగస్థలం నాటకాన్ని వీక్షేంచేందుకు ఇక్కడకు చేరుకుంటారంటే ఎంతటి ప్రత్యేకత ఉందో అర్థం చేసుకోవచ్చు….